
Telangana congress news today(Political news in telangana):
మాజీ మంత్రి తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్. BRS పాలేరు టికెట్ సిట్టింగ్‌కే ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు తుమ్మల నాగేశ్వర్‌రావు.
BRSకు తుమ్మల కొద్ది రోజులుగా దూరంగా ఉన్నారు. ఇప్పటికే అనుచరులతో వరుస భేటీలు నిర్వహించారు. అనుచరులు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తుమ్మలను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం కనిపిస్తోంది.
తుమ్మల పాలేరు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడ ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతానని నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ బరిలో ఉన్నారు. అటు, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సైతం తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.
అయితే, షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే పార్టీ విలీనం ఉంటుందని అంటున్నారు. షర్మిల, తుమ్మల ఇద్దరూ కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటే.. పాలేరు టికెట్ ఎవరికి అనేది ఆసక్తికరమైన విషయం.
లోకల్ అండ్ స్ట్రాంగ్ లీడర్ కాబట్టి తుమ్మల నాగేశ్వరరావుకే పాలేరు కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చు. ఆయన పరపతి కేవలం పాలేరుకే పరిమితం కాదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపగల బలమైన నాయకుడు. ఇటీవల ఏకంగా వెయ్యి కార్లు, రెండు వేల బైక్‌లతో హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటారు. అటు పొంగులేటి హవా, ఇటు తుమ్మల ఇమేజ్ రెండూ జతకలిస్తే.. ఉమ్మడి ఖమ్మంలో 10కి 10 సీట్లు హస్తం ఖాతాలోకే. ఇది పక్కా.
మరి, షర్మిల. ఆమె రేంజ్ అంతకుమించి అంటున్నారు. కుదిరితే సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ బరిలో. లేదంటే కర్నాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని టాక్. పార్టీలోనూ, ఏర్పడబోయే ప్రభుత్వంలోనూ కీలక పదవి కట్టబెడతారని తెలుస్తోంది. అయితే, షర్మిల రాక రాష్ట్ర నేతలకు ఇష్టం లేకపోవడంతో.. నేరుగా డీకే శివకుమార్ సహాయంతో సోనియా, రాహుల్ గాంధీలతోనే డీల్ చేస్తున్నారామె.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పైపైకి పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మిగతా జిల్లాల్లోనూ రేసుగుర్రంలా దూసుకుపోతోంది. వరుస చేరికలతో హస్తం దూకుడు మామూలుగా లేదు. ఇదే సమయంలో బీజేపీలో నిరుత్సాహం ఆవహించడం మరింత కలిసొచ్చే అంశం. అందుకే, కాంగ్రెస్ పేరు వింటేనే కేసీఆర్ కలవరపడుతున్నారని అంటున్నారు. తుమ్మల, పొంగులేటిలు తమకు టికెట్ ఇవ్వలేదని మాత్రమే పార్టీపై విరక్తి పెంచుకోలేదు. గులాబీ బాస్ దొరతనంపై తిరుగబడ్డారు. కనీసం ప్రగతిభవన్‌లోకి సైతం రానివ్వని బాసిజాన్ని భరించలేక పోయారు. ఆత్మగౌరవం కోసమే సీనియర్ లీడర్లు కారు దిగేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోయే సముద్రంలాంటి కాంగ్రెస్‌లో కలిసిపోతున్నారు.