స్కిల్.. పనులు షురూ!
⦿ స్కిల్ వర్సిటీ నిర్మాణంలో ముందడుగు
⦿ భవన నిర్మాణ పనులు మొదలు
⦿ భూమిపూజ చేసిన నిర్మాణ సంస్థ మేఘా
⦿ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి తొలిదశ భవనాల పూర్తి
⦿ చక్కటి వెంటిలేషన్ ఉండేలా నిర్మాణాలు
హైదరాబాద్, స్వేచ్ఛ: skill university: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సీటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది మేఘా సంస్థ. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట నెట్ జీరో వ్యాలీలో శుక్రవారం భూమిపూజ చేశారు ఆ సంస్థ ప్రతినిధులు. ఈ పూజా కార్యక్రమంలో ఎంఈఐఎల్ డైరెక్టర్ రవి పీ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలిదశ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని రవి పీ రెడ్డి తెలిపారు. ఎయిర్ కండీషనర్లు లేకుండా ఓపెన్ ఎయిర్ వ్యవస్థ, చక్కటి వెంటిలేషన్‌తో కూడిన భవనాల నిర్మాణం ఉంటుందని శివకుమార్ వెల్లడించారు.
స్కిల్ వర్సిటీకి మేఘా విరాళం
స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి ఇటీవలే రూ.200 కోట్ల విరాళం ప్రకటించింది మేఘా సంస్థ. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎంఈఐఎల్ మధ్య భవనాల నిర్మాణానికి సంబంధించి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగింది. మేఘా ఎండీ కృష్ణారెడ్డి, స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు దీనిపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణహితంగా భవనాల నిర్మాణం జరగబోతోంది. అకడమిక్, అడ్మిన్ బ్లాక్స్, లైబ్రరీ, ఆడిటోరియం, అత్యాధునిక క్లాస్ రూములు, ప్రయోగ శాలలు, ఇంకా ఇతర మౌళిక సదుపాయాలను కల్పించనున్నారు.
అన్నీ ఒకేచోట
హైదరాబాద్ శివార్లలోని కందుకూరు మండలంలో మీర్ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధునాతన బోధనా సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను సీఎం పరిశీలించారు. తర్వాత భవన డిజైన్లకు తుదిరూపు ఇచ్చి, శుక్రవారం పనులు మొదలుపెట్టారు.