Big Stories

FarmHouse Case: కేసీఆర్ యాక్షనే కొంపముంచిందా? అంతా ఆయన వల్లేనా?

FarmHouse Case: ఫాంహౌజ్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్న కేసు. 14 మంది పోలీస్ అధికారులతో సిట్ దర్యాప్తు చేస్తున్న కేసు. ఫాంహౌజ్ తీగలాగితే.. ఢిల్లీ, కేరళలో గుట్టు రట్టవుతున్న కేసు. ఏకంగా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నే సిట్ టార్గెట్ చేసిన కేసు. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫాంహౌజ్ కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం సంచలనమే. తెలంగాణ సర్కారుకు ఇది బిగ్ షాకే.

- Advertisement -

న్యాయనిపుణుల వాదన ప్రకారం.. అంతా సీఎం కేసీఆర్ వల్లే అంటున్నారు. కేసీఆర్ చూపించిన అత్యుత్సాహం వల్లే.. ఫాంహౌజ్ కేసు సిట్ చేజారిందంటున్నారు. ఆనాడు కేసీఆర్ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఉండకపోయుంటే.. ఇప్పుడీ కేసు సీబీఐకు అప్పగించి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతా, కేసీఆర్ ఓవరాక్షన్ వల్లేననే వాదన వినిపిస్తోంది.

- Advertisement -

ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. నిందితులు అడ్డంగా దొరికిపోయారు. సీసీకెమెరాలు, ఆడియా రికార్డుల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కేసు పెట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. అంతా సజావుగా సాగుతున్న దశలో.. సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి.. ఫాంహౌజ్ కేసులో వీడియోలను ప్రజల ముందుంచారు. దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలకు, ప్రతిపక్ష పార్టీలకు ఆ సీడీలను పంపించి మరింత సంచలనంగా నిలిచారు. ఇదే ఇప్పుడు ఈ కేసుకు ప్రతిబంధకంగా మారింది.

పోలీసుల దగ్గర మాత్రమే ఉండాల్సిన సాక్షాలు, వివరాలు.. ముఖ్యమంత్రి చేతికి ఎలా వచ్చాయి? కేసీఆర్ డైరెక్షన్ లోనే పోలీసులు పని చేస్తున్నారా? దర్యాప్తు అధికారులు కేసీఆర్ చెప్పినట్టు చేస్తున్నారా? అనే అనుమానం ఆ ముగ్గురు నిందితులు వ్యక్తం చేశారు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వ సిట్ పై తమకు నమ్మకం లేదని.. జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును కోరారు.

ఫాంహౌజ్ కేసు వీడియోలను సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపించారు. అలా నేరుగా న్యాయమూర్తులకు కేసు వివరాలు పంపించడం చట్ట విరుద్ధం. ఆ విషయంలో హైకోర్టు న్యాయమూర్తి గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ కేసు ఏసీబీ పరిధిలోకి వస్తుందని.. సిట్ కు దర్యాప్తు చేసే అధికారం లేదని కూడా వాదించారు.

ఇలా సుదీర్ఘ వాదనల అనంతరం తాజాగా ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. సిట్ ను రద్దు చేస్తూ.. వెంటనే కేసును సీబీఐకు అప్పగించాలని ఆదేశించింది. అయితే, సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పుపై డివిజన్ బెంచ్ కు గానీ, సుప్రీంకోర్టుకు గానీ సర్కారు వెళ్లే అవకాశం ఉంది.

ఈ కేసు సిట్ చేజారి.. సీబీఐ చేతికి చిక్కడానికి.. ప్రధానంగా సీఎం కేసీఆర్ తీరే చేటుగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ కనుక కాస్త ఓపికపట్టి ఉంటే.. ఆ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టి.. వీడియోలను బయటకు రిలీజ్ చేసి ఉండకపోతే.. ఇప్పుడీ కేసు సీబీఐకు ఇచ్చేవారు కాకపోవచ్చని అంటున్నారు. అంతా కేసీఆర్ వల్లే..అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News