భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నమైన రీజినల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టు దిశగా కీలక అడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి అవసరమైన సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం.
గతంలో రూపొందించిన రీజినల్ రింగ్ రైలు మార్గం రీజినల్ రింగ్ రోడ్డుకు సుమారు 10 నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉండేది. రెండు మార్గాలు వేర్వేరుగా ఉండటం వల్ల భూసేకరణ భారంగా మారుతుందని.. పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఈ క్రమంలోనే రింగ్ రోడ్డుకు సమాంతరంగానే రింగ్ రైలు మార్గం ఉండేలా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ప్రస్తుతం రింగ్ రోడ్డు వెంటే రైల్వే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే అంశంపై తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి కచ్చితమైన కాలపరిమితిని ఇప్పుడే చెప్పలేమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే డీపీఆర్ సిద్ధం చేసేందుకు అవసరమైన ప్రాథమిక సర్వేకు అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఈ ప్రక్రియలో వేగం పెరిగింది. సర్వే పూర్తయి పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైన తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వం.. నీతి ఆయోగ్.. కేంద్ర ఆర్థిక శాఖల ఆమోదానికి పంపిస్తారు. అన్ని విభాగాల నుండి అనుమతులు లభించిన అనంతరం ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు.. శివారు ప్రాంతాల అభివృద్ధికి ఇది కీలకమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే పలు సందర్భాల్లో ఆయన వ్యక్తిగతంగా కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. రైలు మార్గం.. రోడ్డు మార్గం పక్కపక్కనే ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా భూసేకరణ సమస్యలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో ఈ అంశాన్ని నిరంతరం వెంబడించడంతో కేంద్రం నుండి స్పష్టమైన హామీ లభించింది.
రీజినల్ రింగ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు సైతం పెద్దపీట వేయనుంది. రింగ్ రోడ్డు.. రింగ్ రైలు సమన్వయంతో సాగితే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు వెలిసే అవకాశం ఉంది. డీపీఆర్ సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయింది. రానున్న రోజుల్లో సర్వే పనులు వేగవంతం కానున్నాయి.