Revanth Govt: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటు సీఎం రేవంత్.. అటు కేసీఆర్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. రాజకీయ ‘స్థానిక’ చదరంగంలో విజయం ఎవరిది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి అధికార పార్టీ ఇచ్చే షాక్ నుంచి.. కారు పర్మినెంట్‌గా షెడ్‌లో ఉండిపోతుందని అంటున్నారు. అసలేం జరుగుతోంది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.
స్థానిక ఎన్నికలు ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ తన కూతురు కవిత ద్వారా తెలంగాణ జాగృతి అసోసియేషన్‌ను యాక్టివ్ చేయించారు. బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది కవిత డిమాండ్. సమయం దొరికిన ప్రతీసారీ మీడియా ముందుకొచ్చి ఇదే విషయాన్ని ఊదర గొడుతున్నారు. లేకుంటే బీసీలు రాజకీయంగా నష్టపోతారని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కారు పార్టీ ఎత్తులను పసిగట్టిన పాలకపక్షం.. లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా చెబుతోంది. బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది రేవంత్ సర్కార్. నవంబరులో కులగణన ముగియడంతో సర్వే రిపోర్టు జనవరిలో విడుదల చేయాలని భావిస్తోందట.
దీని ఆధారంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అప్పుడే ప్రభుత్వం ప్రకటన చేయవచ్చని పాలకపక్షం నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని చెబుతున్నారు.
ALSO READ: నేడు అసెంబ్లీకి కేసీఆర్.. కారణం అదేనట!
ఏ మాత్రం ఆలస్యమైనా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన. సకాలంలో ఎన్నికలు జరిగితే నిధులకు ఢోకా ఉండదన్నది అధికార పార్టీ ఆలోచన. ఆ విధంగా చకచకా అడుగు లేస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ సైతం జనవరిలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీని ద్వారా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల ఆలోచన చేస్తున్నారు. ఇటు బీసీ, అటు ఎస్సీల వర్గీకరణపై రిపోర్టు వెల్లడిస్తే.. స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది.
రేవంత్ సర్కార్ ఇప్పటికే మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈలోగా కుల గణన సర్వే వెల్లడిస్తే.. తమ ఉనికి పోతుందని ముప్పు ఏర్పడే అవకాశముందని భావిస్తోంది బీఆర్ఎస్.
ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు కారు పార్టీకి దెబ్బకొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రూరల్ వల్లే వచ్చిందని నమ్ముతోంది కూడా. వచ్చే ఏడాదిలో పైవన్నీ అమలు చేస్తే, పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది కొందరు కారు నేతల మాట. అదే జరిగితే నేతలు వలసపోవడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతల కేసు వ్యవహారంపై దర్యాప్తు స్పీడ్‌గా కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో పట్టు కోల్పోతే కేడర్ చెల్లాచెదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కారు పార్టీ ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారే అవకాశముందన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల ఆలోచన.