Local Body Elections: తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల హంగామా మొదలైందా? కులగణన రిపోర్టును అధికార ప్రభుత్వం బయటపెట్టడంతో రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనుందా? గాడ్ ఫాదర్ల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు చేస్తున్నారా? సీఎం రేవంత్‌రెడ్డితో సీనియర్ నేతలు ఏమన్నారు? అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఎన్నికల గంట మోగనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ ప్రభుత్వం రెడీ అయ్యింది. కులగణన నివేదికపై అసెంబ్లీలో గంటల తరబడి చర్చ జరిగింది. తెలంగాణలో బీసీలు 56 శాతం పైగానే ఉన్నారని తేల్చింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కానీ పార్టీ పరంగా తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కుండబద్దలు కొట్టేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కొద్దినెలల కిందట పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. రీసెంట్‌గా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఫిబ్రవరి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల కావచ్చని కాంగ్రెస్ నేతల మాట.
నోటిఫికేషన్ వెలువడకముందే అప్పుడే పల్లెల్లో ‘స్థానిక’ సందడి మొదలైంది. గాడ్ ఫాదర్ల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ మొదలుపెట్టేశారు. మరోవైపు అధికార యంత్రాంగం పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేసినా తాము సిద్ధంగా ఉన్నామని అధికారుల మాట.
ALSO READ: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ప్రకటన.. ఇరకాటంలో బీఆర్ఎస్, బీజేపీలు
జనవరి 26 నుంచి ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి ఇదే సరైన సమయని, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం.
కులగణన సర్వే వెల్లడి కావడంతో వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసింది. అదే ఏడాది జులై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. సర్పంచుల ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీ టీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినట్టు గత రికార్డులు చెబుతున్నాయి. ఈసారి దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు క్లీన్‌స్వీప్ చేయాలన్నది కాంగ్రెస్ వాదుల ఆలోచన.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే గ్రామాల్లో పార్టీపై సానుకూల వాతావరణం ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించడం సునాయశమవుతుందని లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడం ఖాయమన్నది ప్రభుత్వ వర్గాల మాట.