JSW Combat SUV: భారత్‌లో SUV మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం SUVల విభాగంలో కొత్త కంపెనీలు కూడా తమ మోడళ్లతో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో JSW గ్రూప్‌కు చెందిన JSW మోటార్స్ తన తొలి SUVతో భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్‌కు కాంబ్యాట్ (Combat) అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన చెరీ గ్రూప్‌కి చెందిన జెటూర్ T2 ఆధారంగా ఈ SUVను అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్న కాంబ్యాట్‌ను ఈ పండుగ సీజన్‌లోనే దేశంలో విడుదల చేసే అవకాశం ఉంది.
JSW కాంబ్యాట్ ధరను సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎక్స్ షోరూమ్‌గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ధరలో వచ్చే 5-సీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVగా ప్రత్యేకంగా నిలవొచ్చు. హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు దాని బలమైన SUV డిజైన్ కారణంగా కాంబ్యాట్ కు మంచి పోటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ SUV టయోటా ఫార్చ్యూనర్ లాంటి మోడళ్లను ప్రత్యామ్నాయంగా చూసే కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశముంది.
డిజైన్ పరంగా జెటూర్ T2లో కనిపించే ప్రధాన రూపాన్ని JSW కాంబ్యాట్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే, భారత మార్కెట్ కోసం హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్లు, బ్యాడ్జింగ్‌లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. బాక్సీ బాడీ, ఎత్తైన SUV స్టాన్స్, పెద్ద బంపర్లు, విస్తృతమైన క్లాడింగ్ వంటివి దీని ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, నిలువుగా అమర్చిన LED టెయిల్ ల్యాంప్స్, వెనుక భాగంలో స్పేర్ వీల్ లాంటి అంశాలు SUVకి రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇస్తాయి.
క్యాబిన్‌లో కూడా ప్రీమియం ఫీల్ అందించేలా ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఇందులో 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.6 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉంటాయి. అంతేకాకుండా 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు ఉండొచ్చు. 360 డిగ్రీల కెమెరాతో పాటు కారు కింద భాగాన్ని కూడా చూపించే 540-డిగ్రీ కెమెరా వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
కాంబ్యాట్ లో పవర్ ట్రెయిన్ ఆకట్టుకోనుంది. జెటూర్ T2లో ఉపయోగిస్తున్న 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4kWh బ్యాటరీ కలయికను JSW కూడా ఉపయోగించే అవకాశం ఉంది. T2లో ఈ వ్యవస్థ మొత్తం 360hp పవర్, 610Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ ముందు చక్రాలకు చేరుతుంది. అయితే JSW కాంబ్యాట్‌ను భారత్‌లో ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో మాత్రమే తీసుకురావచ్చని తెలుస్తోంది.
18.4kWh బ్యాటరీతో జెటూర్ T2 90 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ రేంజ్ అందిస్తుంది. 6.6kW AC ఛార్జర్‌తో 30 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 30-80 శాతం ఛార్జింగ్‌కు సుమారు 27 నిమిషాలు పడుతుంది. హైబ్రిడ్ మోడ్‌లో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో మొత్తం డ్రైవింగ్ రేంజ్ సుమారు 1,200 కిలోమీటర్ల వరకు ఉంటుందని T2 స్పెసిఫికేషన్లు చెబుతున్నాయి.
Read Also: ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!