Revati Daughter – Allu Arjun: అమ్మ ఊరికెళ్లింది. వస్తోంది.. మా అన్న కూడా వస్తాడు. అప్పుడు కలిసి ఉంటాం. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుమార్తె. ఈ మాట విన్న ఎవరి కంటైనా కన్నీరు రావాల్సిందే. అభం శుభం తెలియని వయస్సులో తల్లిని కోల్పోయిన ఆ చిన్నారి మాటలు వింటే గుండె తరుక్కు పోవాల్సిందే. రేవతి కుమార్తె శాన్వికను బిగ్ టీవీ పలకరించగా, ఆ పసి హృదయం తన మనసులో ఉన్న అమ్మ ప్రేమను చెప్పుకుంది. అంతేకాదు మా అన్న వస్తాడంటూ.. తన అన్నపై ఉన్న ప్రేమను పంచుకుంది. భాస్కర్
పుష్ప 2 సినిమా విడుదల సంధర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ తొక్కిసలాటలో మహిళ రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. తన పిల్లలను చూసుకుంటూ మురిసిపోయిన ఆ తల్లి ప్రాణం పోగా, ఆ ఇల్లు వెలుతురు లేని గదిలా అంధకారంలో ఉంది. రేవతి భర్త భాస్కర్ కూడా ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుండి కోలుకుంటున్నారు. కానీ రేవతి కుమారుడు మాత్రం 11 రోజులుగా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
ఇటీవల ఈ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కాగా, బెయిల్ పై బయటకు వచ్చారు. సినీ తారలు వారింటికి వెళ్లి పరామర్శించారు. కానీ రేవతి కుటుంబం వైపు మాత్రం కేవలం బన్నీ వాసు మాత్రమే వెళ్లి పరామర్శించి తన వంతు భరోసా కల్పించారు. ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున కూడా సారీ.. సారీ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేవతి కుటుంబానికి అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ పరిహారంగా ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు అందజేస్తానని కూడా చెప్పారు. అయితే డబ్బులు కాదు కానీ, ఆ తల్లిని కోల్పోయిన పసి హృదయాలు మాత్రం ఒకరు వైద్యశాలలో, మరొకరు ఇంటిలో ఉన్నారు.
రేవతి కుమార్తె శాన్వికను బిగ్ టీవీ పలకరిస్తే.. ఒక్కొక్క మాటకు కన్నీరు రావాల్సిందే. మా అమ్మ ఊరికెళ్లింది. వస్తోంది.. మా అన్న కూడా వస్తాడు. నేను మా అన్నను చూశాను. తప్పక వస్తాడు.. నాతో కలిసి ఆడుకుంటాడంటూ.. ముద్దు ముద్దు మాటలు చెబుతోంది ఆ చిన్నారి. అంతేకాదు తన అమ్మ వస్తుందన్న నమ్మకం ఆ చిన్నారి కళ్లలో కనిపిస్తుండగా, ఆ తల్లి ఇక రాదన్న విషయం కూడా తెలియని పసి హృదయమది. అందుకే కాబోలు మా అమ్మ వస్తోందని ఇప్పటికీ.. ఆ చిన్నారి నమ్ముతోంది. ఆ చిన్నారి మాటలే నిజమై ఆ తల్లి.. మళ్లీ తిరిగి వస్తే అందరికీ ఆనందమే. కానీ అది జరగని పని.
ఏదిఏమైనా అమ్మ ఇక లేదన్న విషయం తెలిసిన రోజున, ఆ చిన్నారి మనస్సు ఎంత గాయపడుతుందో కానీ ఆ ఊహ కూడా భారంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే అన్న వస్తాడంటూ.. ఇంటి వద్ద ఎదురుచూపుల్లో ఉన్న ఆ చిన్నారి.. కోరిక నెరవేరాలని అందరం కోరుకుందాం. అందరి మాదిరిగానే శ్రీ తేజ్ కూడా ఆనందకర జీవితాన్ని సాగించాలని మనస్పూర్తిగా దేవుణ్ణి కూడా పూజిద్దాం!