Seethakka : కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే పని చేస్తామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. ఏ పదవీ లేకపోయినా పర్వాలేదని తేల్చి చెప్పారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతల రాజీనామాలపై సీతక్క స్పందించారు. సీనియర్లు తమపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే రాజీనామా చేశామన్నారు. మా పదవులే వారికి అడ్డంకిగా మారాయని తెలిపారు. అందుకే పార్టీ పదవులకు రాజీనామా చేశామన్నారు. పదవులు లేకున్నా పనిచేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేయని నేతలు మాట్లాడితే మాత్రం సహించేదిలేదని సీతక్క తేల్చిచెప్పారు. తాము ఆరేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నామని అన్నారు. పదవికి రాజీనామా చేసిన 13 మంది నేతలు.. రేవంత్ అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేసిన లేఖను మాణిక్కం ఠాగూర్ కు పంపారు.