Serial effect: సీరియల్స్ అంటే ఇంత పిచ్చి కూడా ఉంటుందా? ఒక కుటుంబంలో చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. టీవీ స్క్రీన్‌పై సీరియల్స్ కోసం నిజజీవితాన్ని పణంగా పెట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోడిపుంజుల తండాలో ఆదివారం జరిగిన ఈ ఘటన అందరినీ కుదిపేసింది. ఉదయం నుంచే పొలం పనుల్లో ఉండి, అలసటతో ఇంటికి వచ్చిన భర్తకు తిండి పెట్టకుండా, టీవీలో వచ్చే సీరియల్ చూసే పనిలో మునిగిపోయింది భార్య. భర్త అన్నం అడగగా, ముందు సీరియల్ అయిపోగానే పెడతా అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.
సీరియల్ ముఖ్యమా?
ఇది విని కోపంతో ఊగిపోయిన భర్త, సీరియల్ పిచ్చి గురించి ప్రశ్నించడంతో తగవు పెద్దదైంది. సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని అడిగిన భర్తతో మాటామాటా పెరిగి గొడవగా మారింది. భర్త మాటలు తట్టుకోలేక, కోపంతో ఆలోచించకుండా భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉన్న పురుగుల మందు తీసుకొని తన చిన్నారికీ తాగించి, తానూ తాగేసింది.
ఈ పరిస్థితి గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొడుకుస్థితి విషమంగా ఉండగా, భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొరుగువారు మాట్లాడుతూ, ఇంట్లో చిన్న గొడవలు జరుగుతాయి కానీ ఇంత ఘోరంగా ఊహించలేకపోయాం. సీరియల్స్ కోసం జీవితం పణంగా పెట్టుకోవడం ఎంత తప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు.
సీరియల్ పిచ్చి పెరిగిన ప్రభావం
ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. కుటుంబ సమయాన్ని కోల్పోయి టీవీ ముందు గంటల తరబడి కూర్చోవడం, ఆ కథల్లో మునిగి పోవడం చాలా మందిలో విపరీతమైన మానసిక ఒత్తిడిని సృష్టిస్తోంది. చిన్నచిన్న విషయాలకే కోపంతో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అలవాటైపోతోంది. నిపుణుల మాటల్లో, సీరియల్స్ చూడటంలో తప్పు లేదు కానీ, అవి కుటుంబ బంధాలను దెబ్బతీయకూడదు. ఇల్లు, బంధాలు, మనుషులు ముఖ్యమని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: AP heli tourism: కార్లకు గుడ్‌బై.. ఇక హెలికాఫ్టర్ రైడ్స్ తోనే టూర్స్.. ఏపీలో ఇక జర్నీ గాలిలోనే!
కోడిపుంజుల తండాలో ఈ ఘటన విన్నవెంటనే గ్రామస్తులు గుంపులు గుంపులుగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సీరియల్ కోసం ఇంత దారుణం చేస్తారని ఊహించలేకపోయాం. చిన్నపిల్లాడి పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని అక్కడివారు వాపోతున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి ఘటనలు కుటుంబాల్లో అవగాహన లేకపోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడమే కారణమని సమాజ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సీరియల్స్ మితంగా చూడడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, సమస్యలు పెద్దదయ్యేలోపే మాట్లాడి పరిష్కరించుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఒక క్షణిక భావోద్వేగం ఒక చిన్నారి ప్రాణాన్ని పోగొట్టే పరిస్థితికి దారితీసింది. సీరియల్ పిచ్చి ఎంతవరకు అనేది మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టీవీ ప్రోగ్రామ్స్ వినోదం కోసం మాత్రమే, వాటిని జీవితంలో ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం విషాదాలకు దారి తీస్తుంది.