Siddipet lineman: సాధారణంగా చెరువులోకి వెళ్లాలంటేనే చాలామంది వెనకడుగు వేస్తారు. కానీ, నాగసముద్రం చెరువు మధ్యలో విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చి కరెంట్ పునరుద్ధరించాలంటే? ఆ పని ఎలాంటి జంకు లేకుండా, ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి చూపించాడు సిద్దిపేట లైన్మెన్ హైముద్దీన్. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి, మునిగే ప్రమాదం, కరెంట్ షాక్ భయం అన్నిటినీ తట్టుకొని, స్తంభం ఎక్కి లైన్ మళ్లీ కనెక్ట్ చేశారు. విద్యుత్ నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఈ సాహసం చేయడమే కాకుండా, తన డ్యూటీని ఎంత నిబద్ధతతో తీసుకుంటాడో కూడా రుజువు చేశాడు.
సిద్దిపేట జిల్లాలోని నాగసముద్రం చెరువులో ఒక విద్యుత్ లైన్ తెగిపోవడంతో పరిసర గ్రామాలు చీకట్లో మునిగిపోయాయి. ఎక్కడైనా ఇలాంటిది జరిగితే, సాధారణంగా ఫిర్యాదు నమోదు చేసి, భద్రతా ఏర్పాట్లు చూసి, పరిస్థితులు సర్దుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తారు. కానీ, ఇక్కడ పరిస్థితి కొంచెం వేరుగా ఉంది. చెరువు నీటిలో మునిగిపోయిన స్తంభం వద్ద లైన్ తెగిపోవడంతో, వెంటనే చర్యలు తీసుకోకపోతే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఈ సమయంలో రంగంలోకి దిగారు లైన్మెన్ హైముద్దీన్. తాడుతో తన శరీరాన్ని కట్టుకొని, చెరువు మధ్యలోని విద్యుత్ స్తంభం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక్కో అంచెలో జాగ్రత్తగా కదులుతూ, నీటి అలలు, లోతు అన్నిటినీ దాటుకుంటూ స్తంభం వద్దకు చేరుకున్నాడు. అక్కడికి చేరి, పాడైన లైన్‌ని బాగు చేసి, మళ్లీ కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు.
గ్రామస్థులు చెబుతున్నదాని ప్రకారం, ఆ సమయంలో చెరువులో నీటి ప్రవాహం బాగానే ఉండి, చిన్న తప్పిదం జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశముంది. అయినా, హైముద్దీన్ ఎటువంటి భయం లేకుండా తన పనిని పూర్తి చేశాడు.
Also Read: Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!
ఈ సంఘటనను చూసినవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అతని ధైర్యం, నిబద్ధతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలామంది కామెంట్స్‌లో.. ఇలాంటి నిజమైన ఫీల్డ్ హీరోలు కరెంట్ వస్తే ఎవరూ గుర్తుపట్టరు, కానీ లైన్ పోతే వారే మొదట గుర్తుకొస్తారని రాశారు.
విద్యుత్ శాఖలో పనిచేసే లైన్మెన్‌లు ఎప్పుడూ రిస్క్‌లోనే ఉంటారని తెలిసిందే. తుఫాను, వర్షాలు, వరదలు వచ్చినా, ఎక్కడ లైన్ తెగినా, ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లినా, వారు వెనకడుగు వేయరు. నాగసముద్రం చెరువులో హైముద్దీన్ చేసిన ఈ సాహసం కూడా అదే కేటగిరీలో చేరింది.
విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిన తర్వాత, గ్రామస్తులు హైముద్దీన్‌ను అభినందించారు. కొందరు ఇలాంటి డ్యూటీ మైండ్ ఉన్న ఉద్యోగులు అందరికీ ఆదర్శమని అన్నారు. మరోవైపు, అధికారులూ అతని పనిని గుర్తించి, ప్రశంసలు కురిపిస్తున్నారు.