Singareni Coal: స్వేచ్చ బ్యూరో: మైనింగ్ రంగంలో 137 ఏండ్లుగా ఉన్న సింగరేణి కాలరీస్.. దశాబ్దాలుగా దక్షిణాదిలో పలు రాష్ట్రాలకు నిరాటంకంగా బొగ్గు రవాణా చేస్తోంది. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు రైలు, రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతోంది. 39 గనులు ఉన్న సింగరేణిలో నిత్యం బొగ్గు ఉత్పత్తి, రవాణా జరుగుతున్న నేపథ్యంలో కొంత మొత్తంలో బొగ్గు స్టాక్ గా ఉండటం అత్యంత సహజం. అయితే.. ఈ ఏడాది సింగరేణిలో ఈనెల 4వ తేదీ వరకు 26.51 లక్షల టన్నుల బొగ్గు వివిధ ఏరియాల్లోని గనులు, సీహెచ్ పీల్లో నిల్వ ఉంది. ఇది గత పదేళ్ల స్టాక్ చరిత్రలోనే అత్యల్పం కావడం గమనార్హం. స్టాక్ గా ఉన్న బొగ్గును ఎప్పటికప్పుడు రైలు, రోడ్డు మార్గం ద్వారా అవసరమైన వినియోగదారులకు సంస్థ రవాణా చేపడుతోంది. సాధారణంగా నవంబర్ నుంచి మే నెలల మధ్య బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ సమయాల్లో బొగ్గు నిల్వలు భారీగా పేరుకుపోతాయి. ఇలా ఉన్న బొగ్గు నిల్వలను పలు కారణాల వల్ల ఉత్పత్తి తగ్గిన సమయంలో వీటిని సంస్థ థర్మల్ కేంద్రాలకు సరఫరా చేస్తుంటుంది. ఇది ఏండ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ.
2014-2024 మధ్య సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు స్టాక్ గా ఉన్నాయి. కాగా 2015-16లో 70 లక్షల టన్నులు, 2016-17 లో 74 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు రికార్డు అయింది. ఈ లెక్కల ప్రకారం 2014 నుంచి 2024 వరకు గనులు, సీహెచ్ పీల వద్ద సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా వర్షాకాలం కోసం బొగ్గు నిల్వలు ఉండటం అత్యవసరం. లేదంటే థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గును రవాణా చేయలేని పరిస్థితులు ఏర్పడుతాయి. థర్మల్ పవర్ స్టేషన్ల అవసరాలకు 15 రోజులపాటు సరిపడేలా కనీసం 30 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను సంస్థ అందుబాటులో ఉంచుతోంది. తద్వారా వర్షాకాలంలో విద్యుత్ కేంద్రాలకు నిరాటంకంగా బొగ్గు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది.
సింగరేణి కాలరీస్ లో ఓవర్ బర్డెన్ తొలగింపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అతి కీలకమైన అంశం. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే బొగ్గు పొరలపై ఉండే పైమట్టి(ఓవర్ బర్డెన్) ను సకాలంలో తొలగించాల్సి ఉంటుంది. ఈ ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను కాంట్రాక్టర్ల ద్వారా చేపడుతారు. సింగరేణి కాంట్రాక్టులను బహిరంగ టెండర్ల ద్వారానే కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం ఓవర్ బర్డెన్ టెండర్లలో, కాంట్రాక్టర్లు స్థానిక భౌగోళిక-గనుల పరిస్థితులు, సామాజిక-రాజకీయ పరిస్థితులు, మౌలిక వసతులు మొదలైన వాటిని సమగ్రంగా అంచనా వేయకుండా టెండర్లలో పాల్గొంటున్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన, అంచనా లేక కొందరు కాంట్రాక్టర్లు ఓవర్ బర్డెన్ పనులను ఆపివేయడం లేదా మందకొడిగా నిర్వహించడం వంటివి చేశారు. దీని ఫలితంగా పనితీరు దెబ్బతిని, సింగరేణికి బొగ్గు ఉత్పత్తి లో నష్టం, కాంట్రాక్టర్లకు ఆర్థిక నష్టం జరుగుతూ, న్యాయ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. శ్రీరాంపూర్ ఓసీ-2 ప్రాజెక్టులో, శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే ఓసీలో సైట్ ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను మధ్యలోనే వదిలేయడంతో కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Also read: Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!
ఇలాంటి ఇబ్బందులు, అడ్డంకుటు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతోనే సైట్ విజిట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. టెండర్లలో పాల్గొనే వారు పని ప్రదేశ పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, పనుల పరిధి తదితర అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవడమే సైట్ విజిట్ ముఖ్య ఉద్దేశం. అన్ని పరిస్థితులు, మార్పులను పరిగణలోకి తీసుకొని రేట్లు కోట్ చేస్తాడని నిర్ధారించడమే దీని లక్ష్యం. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన కేవలం సింగరేణిలోనే కాదు అనేక ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇప్పటికే అమలులో ఉంది. సింగరేణిలో మే 2025 నుంచి ఓవర్ బర్డెన్ టెండర్లకు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను ప్రవేశపెట్టారు. సింగరేణిలోనే 2018, 2021, 2023 సంవత్సరాల్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు సీఎంపీడీఐ(కోల్ ఇండియా అనుబంధ సంస్థ) సలహా మేరకు సైట్ విజిట్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా చేశారు. సైట్ విజిట్ కోసం వచ్చే అన్ని కాంట్రాక్టర్లకు సింగరేణి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, సైట్ ను సందర్శించిన ప్రతి కాంట్రాక్టర్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్లను సింగరేణి జారీ చేస్తోంది.
ఇదిలాఉండగా సింగరేణిలో డిపెండెంట్, కారుణ్య ఉద్యోగాల నియామకాల కోసం మెడికల్ బోర్డును సంస్థ కొనసాగిస్తోంది. అయితే ఈ ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, పలువురు దళారులుగా మారి అమాయకులైన కార్మికులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ విచారణలో ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ఇంకా కొనసాగుతుండగా.. మరోవైపు సింగరేణి విజిలెన్స్ విభాగం కూడా ఈ ఆరోపణలపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని కొనసాగిస్తోంది.
Also read: Telangana Rains: దంచి కొట్టిన వర్షం.. నేడు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ వాన ఎక్కడంటే..?