
ZPTC Murder : సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలారు. చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మల్లేశం ప్రాణాలు కోల్పోయారు.
గుర్జకుంట గ్రామానికి చెందిన మల్లేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున చేర్యాల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చేర్యాల పెద్దమ్మగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన.. ఆదివారం జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన తర్వాత గుర్జకుంటలోని చేర్యాల మార్గంలో తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు సహకారంతో కుటుంబసభ్యులు తొలుత సిద్దిపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఎలా చనిపోయారా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మల్లేశం మృతిపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరా తీశారు.
మరోవైపు ఇటీవల స్థానికంగా భూతగాదాలు, రాజకీయ గొడవలు జరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లేశంను ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.