Sircilla News: సోషల్ మీడియాలో సైకోలు, సైతాన్‌లే ఎక్కువ కనిపిస్తారు. కానీ, మనసుంటే.. మంచి చేయాలనే తలంపు ఉంటే.. అదో అద్భుతమైన వేదిక అని.. ఆపన్నహస్తం అందించే వేదిక అవుతుందని నిరూపించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో ఓ హృదయ విదారక ఘటన అందరిని కలిచివేసింది. ఉండేందుకు ఇళ్లు లేదు.. రెంట్‌కు ఉన్న ఇంటికి శవాన్ని తీసుకెళ్లేందుకు వీలు లేదు. హాస్పిటల్ నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చేనేత కార్మికుడు బిట్ల సంతోష్ అనారోగ్యంతో శుక్రవారం చనిపోయాడు. అద్దె ఇంటికి తీసుకెళ్లలేకపోవడంతో.. అంబులెన్స్‌లోనే భార్య శారద, ముగ్గురు పిల్లలు రాత్రాంతా చలిలోనే ఉండాల్సి వచ్చింది. సంతోష్ గతంలో ఉన్న ఇల్లు శిథిలమవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు.
సంతోష్ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ముస్తాబాద్‌లోని తమ పాత ఇంటి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని అక్కడ ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా రోడ్డుపైన అంబులెన్స్‌లోనే ఉంచారు. భార్య, ముగ్గురు పిల్లలు చలిలోనే బయటే ఉండిపోయారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామస్తులు కొందరు.. విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టారు.
Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య మీటింగ్.. ఎవరు ఆ ఎమ్మెల్యేలు..? ఏమంటున్నారంటే..?
దీంతో గ్రామస్తులతో పాటు మండలానికి చెందిన కొందరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వచ్చిన 50 వేలు ఆ కుటుంబానికి అందచేశారు. ఉదయం అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలకు తరలించారు. ఇటు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. వారి పిల్లల విద్య కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.