Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్(17) తన క్లాస్ మేట్ అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు, అమ్మాయి స్నేహితులు శివకిషోర్‌ను బెదిరించారు. దాంతో మనస్థాపానికి గురైన శివకిషోర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో శివ కిషోర్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులు వేడుకుంటున్నారు.
శివకిషోర్ అత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు గ్రామంలో నుంచి పరారయ్యారు. శివ కిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులపై గంభీరావు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని సిరిసిల్ల DSP తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధంతో ఉన్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే శివ కిషోర్ ఆత్మహత్యకు అమ్మాయి కుటుంబ సభ్యులే కారణమా..? పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఐదుగురు యువకుల పాత్ర ఏంత వరకు ఉంది..? వేరే ఏమైనా కారణముందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.