Hema Drugs Case: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎంతలా కలకలం రేపిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నోసార్లు ఈ విషయంపై ఎంతోమంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా.. ఈ విషయం తెలిసి కూడా మిగతా సెలబ్రిటీలు ఇందులో చిక్కుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత ఏడాది ప్రముఖ నటి హేమ కూడా డ్రగ్స్ కేసులో ఇరుకున్న విషయం తెలిసిందే.. గత ఏడాది మే నెలలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో వున్న ఒక ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరిట, రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే అక్కడ డ్రగ్స్ వినియోగం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని కొంతమందిని అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 87 మందికి పైగా డ్రగ్స్ సేవించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో సెలబ్రిటీ హేమ కూడా పట్టుబడింది. దీంతో వార్తలు దావణంలా వ్యాప్తి చెందడంతో.. తాను అక్కడ లేనని, హైదరాబాదులో బిర్యాని చేస్తున్నాను అంటూ వెంటనే వీడియో కూడా రిలీజ్ చేసి నానా రచ్చ చేసింది హేమ. దీనికి ఆమె బ్లడ్ శాంపిల్స్ లో ఆమె డ్రగ్స్ తీసుకుందని ఆధారాలతో సహా బయటపడినా కూడా దానిని ఆమె వాదించింది. తాను డ్రగ్ తీసుకోలేదని కచ్చితంగా తాను ఈ సమస్య నుంచి బయటపడతానని చెప్పింది. ఇకపోతే హేమ అరెస్ట్ అయిన పది రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలైంది. మళ్ళీ సెప్టెంబర్లో హేమాతో సహా 87 మందిపై పోలీసులు వివరణాత్మక చార్జిషీటు దాఖలు చేశారు.
డ్రగ్స్ కేసులో ఊరట..
అయితే ఇప్పుడు తాజాగా ఈమెకు డ్రగ్స్ కేసు నుంచి కాస్త ఉపశమనం దొరికినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీ పై దాడి చేసిన తర్వాత తెలుగు నటి కొల్లా హేమా పై డ్రగ్స్ దుర్వినియోగం కేసులో నమోదైన తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 27 (బి) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి హేమా పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిని నిరూపించడానికి ఎటువంటి ధ్రువీకరణ అంశాలు లేవు. దీనికి తోడు హేమ రేవ్ పార్టీలో ఎండిఎంఏ డ్రగ్ ఉపయోగించారు కాబట్టి ప్రభుత్వ న్యాయవాది నోటీస్ ఇవ్వాలని కూడా సూచించిన విషయాన్ని జడ్జి జస్టిస్ హేమంత్ చందన గౌడర్ మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులలో గమనించారు. ఇకపోతే ఎనిమిదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి బెంగళూరు రూరల్ ఎన్ డి పి ఎస్ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి ముందు పెండింగ్లో ఉన్న ఛార్జ్ షీట్ తదుపరి విచారణలను రద్దు చేయాలని కోరడంతో పాటు ఇంటరెగ్నమ్ లోని ఆమెపై విచారణపై స్టే విధించాలని కూడా కోరగా… ఇప్పుడు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. మొత్తానికైతే హేమాకు ఈ డ్రగ్స్ కేసులో కాస్త ఉపశమనం దొరికిందని చెప్పవచ్చు.
తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అరెస్ట్..
ఇకపోతే గతంలో హేమ విచారణకు హాజరు కావాల్సిందని పోలీసులు నోటీసులు పంపినా.. ఆమె హాజరు కాలేదు. పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీనితో గత ఏడాది జూన్ మూడవ తేదీన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ సేవించడం, రైడ్ సమయంలో తప్పుడు పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వడం రేవ్ పార్టీలో నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా అవగాహన కల్పించడం, వీడియో స్టేట్మెంట్లు ఇవ్వడం వంటివి చేయడంతో దర్యాప్తును తప్పుదోవ పట్టించింది హేమ. ఈ కేసులోనే ఈమెను అరెస్టు చేశారు. ఇకపోతే అరెస్టు చేసిన పది రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చింది ఇక అరెస్ట్ చేసిన చాలా రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఆధారాలను సేకరించలేకపోయినట్లు సమాచారం..