Phone Tapping Case : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తీగ లాగుతుంటే పెద్ద డొంకే కదులుతోంది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లో పెద్ద నెట్‌వర్కే నడిచింది. వాళ్లు, వీళ్లు.. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా.. వందలాది లీడర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. గత ఎన్నికల ముందు ఆ పనిలో మరింత జోరు పెంచారని తెలుస్తోంది. నవంబర్ 15 తర్వాత.. ఏకంగా 600 మంది ఫోన్లపై నిఘా పెట్టారని విచారణలో వెల్లడవుతోంది. మావోయిస్టు సానుభూతిపరులు, వాళ్లకు ఆర్థికసాయం అందజేస్తున్న అనుమానితులు.. అనే కేటగిరిలో తమకు కావలసిన వారి ఫోన్ నెంబర్లు చేర్చి.. రివ్యూ కమిటీ నుంచి ప్రభాకర్ రావు అనుమతులు పొందినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రణీత్‌రావు అండ్ టీమ్ కలిసి ఎలక్షన్ మంత్‌లో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారని బయటపడుతోంది.
బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్
కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలపైనా నిఘా పెట్టారట. రహస్యంగా ఫోన్ సంభాషణలు వినడం.. అందులో మాట్లాడుకున్న కీలక విషయాలను పైవారికి చేరవేయడమే వారి పని. అప్పట్లో పార్టీ మారాలనుకున్న గులాబీ నేతల సంగతి అలానే తెలుసుకుని వారిని బెదిరించారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ నేతలకు డబ్బు సాయం చేసే వారి గుట్టు తెలుసుకుని.. పోలీసులతో రెడ్ హ్యాండెడ్‌గా రైడ్ చేసి పట్టుకున్నారని చెబుతున్నారు. ఆ బాధితుల లిస్ట్‌లో ఉన్న పలువురు బీజేపీ నేతలను ఎంక్వైరీకి పిలిచింది సిట్.
విచారణకు పిలిచిన సిట్
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరుకానున్నారు. బుధవారం రావాలని సిట్ ఆ ముగ్గురికీ సమాచారం ఇచ్చింది. అయితే.. హాజరయ్యేందుకు బీజేపీ ఎంపీలు సమయం కోరారు. ఈ నెల 22న వస్తామని చెప్పారు.
Also Read : కిషన్‌రెడ్డికి ఇచ్చిపడేసిన రాజాసింగ్.. డైరెక్ట్ అటాక్
ఎన్నికల సమయంలో ముగ్గురు బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15 నుంచి ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు.. బీజేపీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని భుజంగరావుకు చేరవేశారు. ఆయన ఆ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని BRS నేతలకు పంపినట్లు సిట్ గుర్తించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆ ముగ్గురు బీజేపీ ఎంపీలను విచారణకు పిలిచింది సిట్.