SIT report : సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సోమయాజులు.. పెద్ద స్కెచ్చే వేశారని తెలుస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా.. తెలంగాణలో అన్నిపార్టీలకు చెందిన చాలా మందినే ట్రాప్ చేయాలని చూసినట్టు ఆధారాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, టీజేఎస్ నేతలపైనా కన్నేసినట్టు సిట్ తెలిపింది.
కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహాతో పాటు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఆ ముగ్గురు సంప్రదించారట. హైదరాబాద్ లోని స్కై హై హోటల్ లో వాళ్లంతా కలిశారట. సింహయాజులు ఆ ఆపరేషన్ ను లీడ్ చేసినట్టు సిట్ తెలిపింది. కోదండరాం, దామోదర రాజనర్సింహలను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ విషయం సిట్ దర్యాప్తులో వెల్లడవడంతో తెలంగాణలో మరో చర్చ మొదలైంది.
పార్టీ మార్పుపై చర్చించడానికి కోదండరాం, రాజనర్సింహలు వెళ్లారంటే..? వారికి ఆ ఉద్దేశ్యం ఉందనేగా అర్థం అంటున్నారు. కొంతకాలంగా రాజనర్సింహ కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేరు. గతంలో ఆయన భార్య పద్మినిరెడ్డి.. బీజేపీలో చేరడం ఆయనకు షాక్ ఇచ్చింది. ఆ సమయంలోనే రాజనర్సింహపై విమర్శలు వచ్చాయి. ఆయన గురించి బీజేపీ పెద్దలకు ఘనంగా చెప్పారట సోమయాజులు అండ్ కో. దళిత, రెడ్డి సామాజికవర్గాల్లో రాజనర్సింహకు బలమైన మద్దతుందని.. 20 నియోజకవర్గాల్లో 75 వేల చొప్పున ఓటు బ్యాంకుందని.. ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి అతడి దగ్గర సమాచారముందని.. ఇలా రాజనర్సింహను ఎలాగైనా బీజేపీలోకి లాగేయాలని గట్టి ప్రయత్నమే జరిగిందని సిట్ అంటోంది.
ఇక, ప్రొఫెసర్ కోదండరాం. టీజేఎస్ పార్టీ పుట్టిందే ఆయన వల్లే. పార్టీ అయితే ఉందిగానీ, ఉనికే అంతంతమాత్రం. తెలంగాణ వచ్చి ఇప్పటికే ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఉద్యమ సమయంలో లైమ్ లైట్ లో ఉన్న ఆయన ఆ తర్వాత పట్టించుకునే వారే లేకుండా పోయారు. టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు ఉన్నాయంటారు. తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని లీడ్ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. తాజాగా, బీజేపీ వాళ్లు సైతం రారమ్మంటూ ఇన్విటేషన్ ఇచ్చారని సిట్ రిపోర్టుతో తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాంకు.. క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్ లీక్ కాకపోయి ఉంటే.. ఆయన కాషాయ కండువా కప్పుకునేవారా? వచ్చే ఎన్నికల నాటికైనా ఆయన కమలదళంలో కలిసిపోవడం ఖాయమా?