Skeleton Found: హైదరాబాద్, నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ పాత ఇంట్లో మనిషి అస్థి పంజరం కలకలం రేగిన విషయం తెలిసిందే. మీకు ఒక వీడియో చూపిస్తానంటూ ఓ యువకుడు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లాడు. ఇంటి లోపలకి వెళ్లిన యువకుడు మనిషి అస్థిపంజరం చూపిస్తూ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయడంతో మ్యాటర్ పోలీసులకు చేరిన సంగతి తెలిసిందే.
పాడుబడిన బంగ్లాలో అస్థి పంజరం చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. గత ఏడు సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని ఇంటి ఓనర్ విదేశాల్లో ఉంటారని స్థానికులు పోలీసులకు చెప్పారు. గత కొంత కాలం నుంచి కుటుంబ సభ్యుల మద్య ఆస్థి వివాదాలు తలెత్తడంతో ఇంట్లో ఎవరు ఉండడం లేదని చెప్పారు. గతంలో అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో నివసించినట్టు ఇంటి కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే దీనిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు.
పోలీసులు ఇంటిని తెరిచి పరిశీలించారు. కిచెన్ రూంలో అస్థిపంజరం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో ఇది మానవ అస్థిపంజరమని నిర్ధారణ అయ్యింది. అయితే, దాని పక్కన ఒక నోకియా మొబైల్ ఫోన్, 84 మిస్డ్ కాల్స్‌తో 2015 నాటి డేటాతో కనిపించింది. అలాగే 2016లో రద్దయిన కరెన్సీ నోట్లు కూడా లభ్యం అయ్యాయి. ఈ వస్తువుల ఆధారంగా మృతుడు అమీర్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. అతని వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అమీర్ ఖాన్ ఒంటరిగా నివసించేవాడని, అవివాహితుడని, మానసిక సమస్యలతో బాధపడేవాడని పోలీసులు తెలిపారు. అతని సోదరులు, ఇంట్లో వాళ్లు అతనితో సంబంధాలు తెంచుకోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చారని అన్నారు. దీంతో అతను వేరే చోటికి వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ALSO READ: Weather Update: ఈ రెండు రోజులు బీభత్సమైన వర్షం.. వడగండ్ల వాన వచ్చేస్తోంది..
హబీబ్‌నగర్ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో, ఫోరెన్సిక్ నమూనాలను సేకరించి అమీర్ ఖాన్ ఎలా మృతిచెందాడో.. గుర్తించేందుకు పరిశోధనలు ప్రారంభించారు. ప్రాథమికంగా, హత్య లేదా గొడవకు సంబంధించిన ఆధారాలు ఏమీ లేవని, ఇది సహజ మరణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్థిపంజరం ఎముకలు పాక్షికంగా కుళ్లిపోవడం వల్ల అమీర్ ఖాన్ పదేళ్ల క్రితం చనిపోయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికులలో ఆందోళన కలిగించింది. అంతే గాక, పాడుబడిన ఇళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.
ALSO READ: JOBS: ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.. భారీ వేతనం, లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?