ఇవాళ ఖచ్చితంగా కార్మికులను బయటకు తీసుకువస్తామని రెస్క్యూ టీం అధికారులు చెబుతున్నారు. దీంతో క్షణక్షణం ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. లోపల ఉన్నా కార్మికులు సేఫ్ గా ఉన్నారా? టన్నెల్లో చిక్కుకొని 8 రోజులు దాటుతుండటంతో ప్రాణాలతో ఉన్నారా.. లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు రేకేతిస్తున్నాయి. టన్నెల్లో ఉన్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు టన్నెల్ దగ్గర పోలీసు సెక్యూరిటీ టైట్ చేశారు. ఓ వైపు అంబులెన్సులు, మరోవైపు వైద్యులు టన్నెల్ దగ్గరకు చేరుకోవడంతో ఏ క్షణమైన కార్మికులు బయటకు తీసుకొచ్చే చాన్స్ కనిపిస్తోంది.
ఈ తరుణంలో.. నేడు SLBC టన్నెల్‌ను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేల బృందం. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో శాసన సభ్యుల బృందం వెళ్లనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఘటన జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను సందర్శించనున్నారు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి,ఇతర నాయకులు. ప్రమాద ఘటన, టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిపై ఆరా తీయనుంది బీజేపీ శాసన సభ్యుల బృందం.
కాగా.. SLBC వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బురదలో కూరుకుపోయి ఉన్నారు. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడుస్తుండడంతో.. ఆ 8 మంది బతికుండే ఆశలు లేవంటున్నారు అధికారులు. SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా.. సొరంగంలోని బురదను త్వరగా తొలగించడంపై సహాయక సిబ్బంది దృష్టిసారించారు.
ముందుగా కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్ లోపల పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్ ట్రాలిలతో బయటికి తరలిస్తున్నారు.. నీటితో కలిసిన బురదను బయటికి తరలిస్తూ పనులు వేగవంతం చేశారు. పేరుకుపోయిన బురదను తొలగించి TBM మిషన్ మొదటి భాగానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?
భారత చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సొరంగ ప్రమాదాలలో ఒకటిగా దీన్ని అభివర్ణించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటిసారిగా, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలను రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒకే కమాండ్ కిందకు తీసుకువచ్చామని అన్నారాయన. 11 అత్యుత్తమ సంస్థలు ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్నాయనీ, సాటిలేని సమన్వయం- నైపుణ్యంతో పనిచేస్తున్నాయనీ చెప్పారు మంత్రి ఉత్తమ్.
చిక్కుకున్న కార్మికులను బయటకు వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు 24 గంటలూ పనిచేస్తూ, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఉపయోగిస్తున్నాయని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్లాస్మా కట్టర్లు, హై-గ్రేడ్ షట్టర్లు, ఇతర శిథిలాల తొలగింపు యంత్రాలను సైట్‌లో ఉపయోగిస్తున్నారనీ, ఇంటర్నేషనల్ ఎక్స్ పర్ట్స్.. ఈ వ్యూహాన్ని పర్యవేక్షిస్తున్నారనీ. అడ్డంకులను తొలగించడానికి టన్నెల్ బోరింగ్ యంత్రాలు, నీటిని తొలగించే ప్రక్రియలను తిరిగి పునరుద్దరించినట్టు చెప్పారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.