Gaddam Prasad Kumar: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో నర్సింగ్ ఫంక్షన్ హాల్ నందు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ లకు శిక్షణ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించి ఎన్నికైన నూతన సర్పంచ్ లు, పురపాలక సంఘం ఎన్నికలలో విజయం సాధించి ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు స్పీకర్ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమిక్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో, దేశంలో పెద్ద స్థాయికి ఎదిగిన ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది సర్పంచ్ లుగా, కౌన్సిలర్లు గా రాజకీయ జీవితం ప్రారంభించిన వారేనని, నేను కూడా ఎంపీటీసీ గా రాజకీయ జీవితం ప్రారంభించి ఎంపీపీగా తదుపరి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఇప్పుడు రాష్ట్రంలో శాసన వ్యవస్థలో అత్యంత ఉన్నతమైన అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నానని తెపుతూ…కింది స్థాయి నుండి వచ్చిన ప్రజాప్రతినిధులకు సామాజిక అంశాలు, పేదలకు అందించాల్సిన సేవలపై ఎక్కువ అవగాహన ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉంటుందని, ఇక్కడ ఎన్నికైన సర్పంచ్ లు, చైర్మన్లు, కౌన్సిలర్లలో ఎక్కువ మంది కొత్తవారే కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మీ విధులు, మీరు చేయవలసిన పనులపై మీకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని తద్వారా మీరు ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలను అందించగలుగుతారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు రెండు కళ్ళ లాంటి వారు, అదేవిధంగా బండికి రెండు చక్రాల లాంటి వారని కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు .
Also Read: Lord shiva: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!
పథకాలు సమర్ధవంతంగా ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని స్పీకర్ సూచించారు. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ లు, చైర్మన్లు, వార్డుల సభ్యులు అదృష్టవంతులు, రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజారంజక పరిపాలన జరుగుతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇప్పుడు పదవిలో ఉన్న మీ ద్వారా అమలవుతాయి కాబట్టి మీకు మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ , సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ళు, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్, డ్వాక్రా మహిళలకు ఉచిత రుణాలు వంటి సంక్షేమ పథకాల అమలు గురించి అందరికీ అవగాహన కలిగించి అర్హులైన వారందరికీ అందే విదంగా పనిచేయాలని ఆయన తెలిపారు.
తులం బంగారం, మహిళలకు ఆర్ధిక భరోసా, పెన్షన్ల డబ్బులు పెంచడం వంటి వాటి గురించి మిమ్మల్ని ప్రజలు అడిగినప్పుడు మీరు వారికి అర్ధమయ్యే విదంగా గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఆర్ధిక విద్వంసం, ఇప్పుడు నెలకు 6500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని, ఆర్ధిక పరిస్థితులు చక్కబడగానే త్వరలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వేలు, లక్షల మందిలో ఒక్కరికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది, మీకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల మనసులో నాటుకుపోయే విదంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరూ కలిసి సమిష్టిగా గ్రామాలను, వార్డులను అభివృద్ధి చేసుకోవాలని అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందించాలని తెలిపారు.
వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి, స్పీకర్ వంటి ఉన్నత స్థానాలలో ఉన్నామని నిధులు మంజూరు చేయించే బాధ్యత మాదని సమర్ధవంతంగా ఖర్చు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులదని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ…ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రనిధుల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేవిధంగా కృషి చేస్తామన్నారు. గ్రామ సభల్లో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరించబడతాయని కలెక్టర్ తెలిపారు. తాండూర్ శాసన సభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవచేయడం అదృష్టంగా భావించాలన్నారు. 99 రోజులుగా నిర్వహించే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు జవాబుదారీ తనంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహమేహర, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, జడ్పీ సీఈవో సుధీర్, డి మంగిలాల్, ఆర్డీవో వాసు చంద్ర, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లు గడ్డం అనన్య, పట్లోళ్ల నీరజ, రజిత లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: LPG Cylinder Booking: వంట గ్యాస్‌పై మరో పిడుగు.. బుకింగ్ గడువు రోజులను మరింత పెంచిన కేంద్రం