BigTV English

RED BUS: ఎర్ర బస్సుకు 91 ఏళ్లు.. ప్రగతిపథంలో అనేక రంగులు..

RED BUS: ఎర్ర బస్సుకు 91 ఏళ్లు.. ప్రగతిపథంలో అనేక రంగులు..
red bus

RTC bus history(Telugu news updates): ఆరవ నిజాం నవాబు 1899లో నిజాం స్టేట్ రైల్వేస్ స్థాపించారు. కాచిగూడ నుండి మన్మడ్‌కి మీటర్ గేజ్ రైలు నడిచేది. 7వ నిజాం “మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ” హయాంలో బస్సు సర్వీసులు మొదలయ్యాయి. ఆయన తల్లి జహారా.. తాను దాచుకున్న లక్ష వెండి నాణేలను ఇవ్వగా.. ఆ సొమ్ముతో బస్సు రవాణాకు ముందడుగు పడింది. బ్రిటన్ నుంచి ఓడల్లో 25 సీట్లు గల 27 అల్బేయన్ పెట్రోల్ బస్సులను తెప్పించారు.


రైల్వే రవాణా లేని ప్రాంతాలలో బస్సులను మొదట నడపాలని నిర్ణయించారు. లండన్ నుంచి తెచ్చిన బస్సులలో కొన్నింటికి ఆకుపచ్చ, మరికొన్నింటికి ఎరుపురంగులు వేయించారు. ఆకుపచ్చని రంగు బస్సులు సిటీ బస్సులుగా, రెడ్ బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో నడపాలని నిర్ణయించారు. నిజాం తల్లి పేరులోని Zahra Mohammadienలోని మొదటి అక్షరాన్ని.. ఆమె జ్ఞాపకంగా ‘Z’ తో ప్రత్యేక రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అమలు చేశారు. 1932 ఏప్రిల్ 18 న హెచ్.వై. జెడ్ 0223 నంబరు బస్సును మొదటిగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సుకు సెల్ఫ్ ఉండేదికాదు. నెట్టడం ద్వారానే స్టార్ట్ అయ్యేవి. 05.06.1932న కాచిగూడ నుంచి సిటీ బస్సులు.. గౌలిగుడా నుండి జిల్లా బస్సులు ట్రయిల్ గా నడిపించారు. అనంతర కాలంలో బస్సుల మెయింటెనెన్సు కోసం.. నార్కెట్ పల్లిలో మొదట డిపో ప్రారంభించారు.

1932లో 27 బస్సులు 166 మంది సిబ్బందితో మొదలవగా.. 1949 నాటికి మొత్తం 21 డిపోలు.. 952 బస్సులతో.. NSRTDగా విస్తరించింది. మొత్తంగా 150 బస్సులు ఉండేవి. 1946లో హైదరాబాద్- సికింద్రాబాద్ మధ్య 30 డబల్ డెక్కర్ బస్సులు నడిచేవి. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యే నాటికి.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక్క బస్ డిపో కూడా ఉండేదికాదు.


1950లో ఆర్.టి.సి. యాక్ట్ కేంద్రప్రభుత్వం అమలు చేసింది. నిజాం రాష్ట్ర రైల్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కంపెనీని రెండు భాగాలు చేసారు. 1951న హైదరాబాద్ స్టేట్ లో రవాణా డిపార్ట్మెంట్ ఏర్పడింది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుతో 1958 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా మారింది.

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో బస్సు రూట్ల జాతీయకరణతో 1958లో విజయవాడ, 1959లో మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు డిపోలు ప్రారంభమయ్యాయి. 1963లో విజయవాడలో వర్క్ షాప్ ఏర్పాటైంది. 1964 నుంచి విజయవాడ, హైదరాబాద్ ల మధ్య దూరప్రాంత డీలక్స్ , ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడిచాయి. బస్సుల సంఖ్య పెరగడంతో టైర్ మెయింటెనెన్సు కోసం.. 1970లో హైదరాబాద్లో టైర్ రిట్రేడింగ్ షాప్ పెట్టారు.

1973లో రాయలసీమ జిల్లాల్లో బస్ రూట్ల జాతీయీకరణ జరిగింది. 1975లో ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్లు కోసం నాగార్జున సాగర్‌లో ట్రైనింగ్ కాలేజ్ స్థాపించారు. 1975లో తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులను తీసుకొని సంస్థ నడుపుట ప్రారంభించారు. 1978లో విశాఖపట్నం, విజయవాడలలో సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

1978లో “రోడ్డున్న ప్రతీ గ్రామానికి బస్సు సర్వీసు పథకం” అమలు చేసి పర్యవేక్షణకు హైదరాబాద్, కడప, కర్నూలు, విజయనగరంలలో రీజనల్ మేనేజర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 1985లో రాత్రిపూట దూరప్రాంత సర్వీసులు ప్రారంభించారు. 1987 నవంబరులో ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో బస్సుల జాతీయకరణ జరిగింది. 1996 వరకు సంస్థ లాభాల బాటలో ఉండేది. అప్పుడే అతిపెద్ద సంస్థగా గిన్నిస్ బుక్‌లోకూ ఎక్కి రికార్డు సృష్టించింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూల్ లో అతిపెద్ద బస్ స్టేషన్ సముదాయాల నిర్మాణం జరిగింది. బస్ భవన్, కళ్యాణ మండపం హైదరాబాద్ లో నిర్మించారు. అయితే, 1989 నూతన మోటారు వాహనాల చట్టం రావడంతో ప్రైవేట్ వాహనాలు పెరగడం, ఆర్టీసీ ఖర్చులు అధికం అవడం, ప్రభుత్వం నుంచి రాయితీ సొమ్ములు రాకపోవడంతో.. 1996 నుంచి నష్టాల్లో కూరుకు పోవడం మొదలైంది.

2014లో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయాక.. 02.06.2014న రెండు సంస్థలుగా ఆర్టీసీ చీలిపోయింది. ప్రస్తుతం TSRTC తరఫున 96 డిపోలు, APSRTCకి 129 డిపోలు ఉన్నాయి. తెలంగాణలో 9,233 బస్సులు, ఏపీలో 11,012 బస్సులు నడుస్తున్నాయి.

2004లో గరుడ వోల్వో బస్సులు, 2011లో మల్టీ యాక్సల్ వోల్వో బస్సులు, 2016లో అమరావతి స్కానియా బస్సులు, 2020లో డాల్ఫిన్ క్రూయిజ్ బస్సులు, 2023లో లహరి బస్సులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

7వ నిజాం ‘మీర్ ఉస్మాన్ ఆలీఖాన్’ తల్లి.. “జహ్రా మహమ్మద్” కోరిక, ఆర్ధిక సహకారంతో “ఎర్ర బస్సు” రోడ్డెక్కి.. 2023 జూన్ 15 నాటికి 91 ఏళ్ల ప్రస్థానం పూర్తవుతోంది. ఆనాటి ఎర్రబస్సు ఆ తర్వాతి కాలంలో అనేక రంగులు అద్దుకున్నా.. నేటికీ బస్సంటే ఎర్రబస్సే. ప్రభుత్వాలు ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాలుష్య రహిత బస్సులను ప్రవేశపెడితే బాగుంటుంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించి.. కార్మికుల సంక్షేమంతో పాటు ప్రజల సురక్షిత ప్రయాణం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది.

సేకరణ:
వేణుగోపాల్ నాగుమళ్ళ,
విశ్రాంత ఆర్.టి.సి. డిపో మేనేజర్,
విజయనగరం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×