KTR In Delhi: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక తర్వాత బీఆర్ఎస్ అలర్ట్ అయ్యిందా? ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టిందా? అది రాజకీయ కమిషన్ అంటూ బయటకు చెబుతున్నా, లోలోపల తనవంతు ప్రయత్నాలు చేస్తోందా? గత రాత్రి ఢిల్లీలో కేటీఆర్ ఎవరితో భేటీ అయ్యారు? ఇదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు స్వతహాగా చేసే ఆలోచనను బయటపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం ఉదయం సీఈసీతో బీఆర్ఎస్ టీమ్ భేటీ అయ్యింది. అందులో కేటీఆర్ ఉన్నారనుకోండి. ఎన్నికల సంస్కరణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ కు చెప్పాల్సినవన్నీ చెప్పారు.
ముఖ్యంగా కారు పోలిన గుర్తులను తొలగించాలన్నది ప్రధాన పాయింట్. పోలిన గుర్తులు ఉండడంతో గతంలో తాము నష్టపోయామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నేతలు చెప్పిన విషయాలను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా ఆలకించింది. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది.
ఇదిలావుండగా మంగళవారం సాయంత్రం జాతీయ పార్టీల కీలక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారనే ఓ ఫీలర్ హస్తినలో చక్కర్లు కొడుతోంది. దీని ఉద్దేశం ఏంటి? ఏ పార్టీతో భేటీ అయ్యారనేది కాసేపు పక్కనపెడదాం. బీఆర్ఎస్ టీమ్ ఢిల్లీకి రాకముందు రోజు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బయటకు వచ్చింది.
ALSO READ: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్
ఈ ప్రాజెక్టు నిర్మించడం వెనుక కర్మ, కర్త, క్రియ అన్నీ కేసీఆర్ అని అధికార పార్టీ మీడియా సమావేశంలో వెల్లడించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సభ్యుల సలహాల మేరకు దర్యాప్తుకు ఆదేశించనుంది. ఇదంతా ఒక వెర్షన్.
కమిషన్ నివేదిక ఆధారంగా ఒకవేళ సీబీఐ విచారణకు రేవంత్ సర్కార్ అప్పగిస్తే ఏ విధంగా అడుగులు వేయాలి అనే దానిపై కొన్ని రాజకీయ పార్టీల నేతలతో కేటీఆర్ చర్చించినట్టు అందులో సారాంశం. ముఖ్యంగా బీజేపీ కీలక పెద్దలతో ఆయన భేటీ అయినట్టు వార్తలు లేకపోలేదు. అందులో నిజమెంత అనేది తెలీదు. కాకపోతే ఆ విధంగా ప్రచారం సాగుతోంది.
వారి నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలీదుగానీ బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఉన్నారు. కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై పాలకపక్షం ఇంకెన్ని విషయాలు బయటపెడుతుందో చూడాలి.