
Sudan: సూడాన్‌లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును ప్రారంభించింది ఇండియా. ఆపరేషన్ కావేరి పేరుతో ఇప్పటికే ప్రత్యేక మిషన్ ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఇందులో మొదటి బ్యాచ్ గా 278 మంది భారతీయులను సూడాన్ నుంచి జెడ్డాకు తరలిస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో వారంతా ఢిల్లీకి చేరుకోనున్నారు.
సూడాన్ లో ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సుమారు 500 మంది ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ క్రమంలో సూడాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది.
ఇందుకోసం ఆపరేషన్ కావేరి పేరిట భారత ప్రభుత్వం ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రి డా.ఎస్.జైశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే 500 మంది భారతీయులు సూడాన్ నౌకాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు. వారికి సంబంధించిన ఫొటోలు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మరికొందరు త్వరలోనే ఇక్కడికి చేరుకోనున్నట్లు చెప్పారు.
సూడాన్ నుంచి భారతీయుల తరలింపునకు జెడ్డాలో రెండు సి-130J సైనిక రవాణా విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. సుడాన్‌లో యుద్ధ తీవ్రత, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
విదేశీయుల తరలింపు కోసం సూడాన్ లో ఇరు వర్గాలు 72 గంటల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నారు.