Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: రాజకీయ విమర్శల కోసం ఒకరు విదేశాలు, మరొకరు జిల్లాలు తిరుగుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం సిఎల్పీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన ‘హిట్లర్’ అనే పదంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
‘హిట్లర్’ అంటే నాజీ కాదు..
‘ఏదైనా పని చేపడితే దాన్ని ఎలాగైనా సాధించే క్రమశిక్షణ, ఉక్కు సంకల్పాన్ని సూచించడానికే ముఖ్యమంత్రి ‘హిట్లర్’ అనే పదాన్ని వాడారు తప్ప, నాజీ హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పలేదు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘హిట్లర్’ సినిమా ఉద్దేశం కూడా వేరే ఉంది. చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడాలనే సీఎం ఉక్కు సంకల్పాన్ని నాజీ హిట్లర్‌తో పోల్చడం సరికాడు. కబ్జాదారుల గుండెల్లో భయం పుడుతుంటే ఓర్వలేక కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. గతంలో కేసీఆర్ స్వయంగా తాను హిట్లర్‌నని ప్రకటించుకున్న విషయాన్ని కేటీఆర్ వాళ్ల నాన్నను అడిగి తెలుసుకోవాలి’ అని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు.
ప్రగతి భవన్ ‘నాజీ బంకర్’ లా ఉండేది..
కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం అంటే ‘గురువింద గింజ తన కింద నలుపు ఎరుగనట్లే’ అని మంత్రి విమర్శించారు. పదేళ్ల పాటు కేసీఆర్ సెక్రటేరియట్‌కు రాలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా రానివ్వకుండా ప్రగతి భవన్‌ను నాజీల ‘హిట్లర్ బంకర్’ లా మార్చేశారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని తొలగించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లు చేయడం, టీఎస్‌పీఎస్సీ పేపర్లు అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలను అన్యాయం చేయడం బీఆర్ఎస్ మార్కు ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాకే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సంస్కరించి, పారదర్శకంగా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించామన్నారు. కేటీఆర్ సమానత్వం గురించి మాట్లాడితే ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉంటుందని, ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
హైడ్రా చర్యలు రాజ్యాంగబద్ధమే..
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చి, ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. “హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకుంటోంది. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణను నగర ప్రజలు స్వాగతిస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు” అని మంత్రి అన్నారు. తమ డీఎన్‌ఏలో హింస లేదని, గతంలో బీఆర్ఎస్ తాలిబాన్ విధానంలో పనిచేసిందని ఆరోపించారు.
హరీష్ రావు ‘పొలిటికల్ టూరిజం’ స్క్రిప్టులు..
మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారాలతో, తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదారి పట్టించడానికి ఊరూరూ తిరుగుతున్నారని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. “భూముల ధరలు ఎక్కడైనా తగ్గుతాయా? పెద్దపల్లిలో ధరలు తగ్గాయని దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కృత్రిమంగా భూముల ధరలు పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకోకుండా చేశారు. పోలీసులను బెదిరిస్తూ హరీష్ రావు మాట్లాడుతున్న తీరు ఆయన హుందాతనానికి తగదు. ప్రతిపక్షాల బెదిరింపులకు అధికారులు భయపడాల్సిన అవసరం లేదు, చట్టానికి లోబడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది” అని మంత్రి హామీ ఇచ్చారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్..
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం ‘రైతు డిస్కం’ తీసుకువస్తోందని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 24 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా తప్పకుండా కొనసాగుతాయని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తమ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, తరుగు తీయకుండా, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొని రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను తాము రెండున్నరేళ్లలోనే (ఆరు గ్యారంటీల అమలు ద్వారా) చేసి చూపిస్తున్నామన్నారు.
సింగరేణిని ముంచింది బీఆర్ఎస్సే..
బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుపడి, వారి మిత్రుల ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టింది బీఆర్ఎస్ కాదా? అని మంత్రి నిలదీశారు. కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్-3 గనులు సింగరేణికి దక్కకుండా చేయడం వల్ల రూ.2 వేల కోట్ల ఆదాయం నష్టం వాటిల్లిందన్నారు. సింగరేణిలో రూ.40 వేల కోట్ల బొగ్గు, విద్యుత్ బకాయిలను పెట్టి పోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులను ఓట్ల కోసం వాడుకుని మోసం చేశారని, అందుకే 2023 గుర్తింపు ఎన్నికల్లో సున్నా ఓట్లు వస్తాయనే భయంతో ఆ పార్టీ కార్మిక సంఘం పోటీ చేయలేదని గుర్తుచేశారు.
కారు పూర్తిగా మునిగిపోయంది..
తమ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి లాభాల్లో వాటా ఇచ్చిందని, కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమాతో పాటు హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బొగ్గు నిల్వలపై జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘కారు పూర్తిగా మునిగిపోయింది. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, 10 సీట్లు కూడా రావు’ అని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు.
Also Read: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు.. కోర్టు సంచలన తీర్పు!