Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ రావాలని, ఆయన అనుభవజ్ఞుడని, ఆయన అనుభవం అసెంబ్లీకి అవసరం అని, బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీలోని మీడియా లాంజ్ లో మంగళవారం చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నందున దాన్ని బలహీనపరచడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జీవన్ రెడ్డి ఎలాంటి పదవులు కోరుకోలేదని, స్థానిక సమస్యలే ఉన్నాయని తెలిపారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయనను పార్టీ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
నామినేటెడ్ పదవుల విషయంలో హైకమాండ్ కసరత్తు చేస్తోందని, పోర్ట్‌ఫోలియో కేటాయింపులు ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పారు. భవిష్యత్తులో సీఎం ఎవరనే అంశాన్ని ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.15 వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం చేసిన బకాయిలుగా చూపుతున్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ ఫ్లోర్ కమిటీలు త్వరలోనే భర్తీ అవుతాయని తెలిపారు. మంత్రుల మార్పులు, చేర్పుల్లో సీఎంకే పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.
Also Read: Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్
అనిరుధ్ రెడ్డి ప్రతిపాదించిన ఇప్పపువ్వు సారా మంచి ఆలోచన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పనిచేస్తూ సిక్సర్లు కొడుతుంటే, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ అసెంబ్లీ బయటే ఉండాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఎవరూ ఏ వర్గాన్ని అవమానించేలా మాట్లాడకూడదని సూచించారు. ఇప్పటికే ఎమ్మెల్యే మందుల సామేలు వివరణ ఇచ్చారని, అవసరమైతే మళ్లీ వివరణ ఇస్తారని చెప్పారు. బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రాజ్యసభ అభ్యర్థిని నియమించలేదని ఆరోపించారు. అలాంటి వారు ప్రభుత్వంపై పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.