Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: ‘మేము ఎవరి నుంచో నకలు చేయాల్సిన అవసరం లేదు. గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన పని అంతకన్నా లేదు. వందేళ్ల క్రితం ‘జల్, జమీన్, జంగల్’ కోసం బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డ కొమురం భీం, గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కాకతీయుల చరిత్రే మాకు అసలైన స్ఫూర్తి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకే ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవిదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో శ్రీశ్రీ రవిశంకర్, వాటర్‌మన్ రాజేంద్ర సింగ్ వంటి ప్రముఖ పర్యావరణవేత్తల సలహాలతో త్వరలోనే ప్రత్యేక పర్యావరణ విధానాన్నిరూపొందిస్తామని ప్రకటించారు. ఈ కీలక కార్యక్రమ బాధ్యతలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు వెల్లడించారు.
నాగరికతకు మూలం నదులే.. విధ్వంసం చేస్తే విపత్తులే..
నదీ పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని సీఎం గుర్తుచేశారు. సహజ వనరులను చెరబట్టి విధ్వంసం చేస్తే సునామీలు, తీవ్ర కరువు వంటి ప్రకృతి విపత్తులు తప్పవని హెచ్చరించారు. సమతుల్యత పాటించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఆక్రమణదారుల భరతం పట్టిన వీరత్వం ఉన్న గడ్డ మనదన్నారు. గతంలో మహమ్మద్ బిన్ ఖిల్జీని రేచర్ల రుద్రదేవుడు మూడుసార్లు ఓడించారనీ, రేచర్ల రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి వరంగల్ కేంద్రంగా రామప్ప, పాకాల వంటి అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను నిర్మించారన్నారు. తెలంగాణది చెరువుల చరిత్ర అని, కానీ కాలక్రమేణా అనేక చెరువులు కనుమరుగయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు తమ విలాసవంతమైన ఇళ్లు, ఫంక్షన్ హాళ్ల కోసం చెరువులను ఆక్రమించడంతో వరద నీరు వెళ్లే దారి లేక కాలనీలను ముంచెత్తుతోందని సీఎం వివరించారు.
కోర్టుల నుంచి అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగలేదు..
చెరువుల పరిరక్షణ కోసం ‘హైడ్రా’ను తీసుకువస్తే కబ్జాదారుల నుంచే కాకుండా కోర్టుల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎం తెలిపారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హైటెక్ సిటీ సమీపంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమణదారుల చెర నుంచి విడిపించామన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. కబ్జాలు తొలగించడం వల్ల నేడు బతుకమ్మ కుంట వద్ద మహిళలు ఆనందంగా బతుకమ్మ ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పేదలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వడం లేదని, నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.ఇక మూసీ నది గర్భంలో మురికికూపం మధ్య, కనీసం జీవించలేని దుర్భర స్థితిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించామని సీఎం తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ఎన్ని అభ్యంతరాలు వచ్చినా భవిష్యత్ తరాల కోసం వెనక్కి తగ్గబోమని, అతి త్వరలోనే అత్యంత సుందరమైన మూసీ నదిని ప్రజల కళ్లముందు ఉంచుతామని తేల్చిచెప్పారు. తాను కుర్చీaఓ ఉన్నంత కాలం తప్పు చేసినోళ్లనూ ఎవరినీ వదిలిపెట్టనని సీఎం నొక్కి చెప్పారు.
ఎల్‌నినో ముప్పు.. ఒక పంట త్యాగానికి రైతులు ముందుకు రావాలి..
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, వాతావరణ మార్పుల వల్ల కేవలం 2 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో వచ్చే రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయని, కానీ, తాగడానికి నీళ్లు లేవని సీఎం చెప్పారు. రాబోయే 8 నెలలు వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తరహాలోనే రాజకీయాలకు అతీతంగా కరువును, ఎల్‌నినోను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. మానవాళిని, పశుపక్ష్యాదులను కాపాడుకునే బాధ్యత రైతులపై ఉన్నదని, రైతులు ఒక పంటను త్యాగం చేస్తే అందరికీ నీళ్లు దొరుకుతాయని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
‘క్యూర్, ప్యూర్, రేర్’ గా రాష్ట్ర విభజన.. 3 ప్రత్యేక వ్యవస్థలు..
రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ‘క్యూర్, ప్యూర్, రేర్’ జోన్లుగా విభజించి అనేక కొత్త విధానాలను తీసుకువచ్చామని సీఎం వివరించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్య నివారణ కోసం డీజిల్ ఆటోలు, ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలికి తరలిస్తూ, ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మూడు ప్రత్యేక వ్యవస్థలతో పాలనను గాడిలో పెడుతున్నామన్నారు.3 వేల మంది ప్రత్యేక సిబ్బందితో డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని, ఈ వ్యవస్థ పనితీరును కేంద్ర ప్రభుత్వం సైతం అభినందించిందని తెలిపారు. డ్రగ్స్ వల్ల పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణలో ఆ పరిస్థితి రానివ్వబోమన్నారు. హైడ్రా తో చెరువులు, ప్రభుత్వ ఆస్తులకు పూర్వవైభవం తెస్తున్నామన్నారు. టీజీ సేఫ్ తో ఆహార కల్తీని నియంత్రిస్తున్నామన్నారు.
వెయ్యి మంది ప్రతినిధులతో సదస్సు..
డిసెంబర్ 7,8 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో క్లైమేట్ కాన్క్లేవ్ జరగనుంది. వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.సద్గురు జగ్గీ వాసుదేవ్, హార్ట్ఫుల్నెస్ సంస్థకు చెందిన దాజీ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు.కరువును ఎదుర్కోవటం, వడగాలుల నుంచి ప్రజలను కాపాడటం,పచ్చదనాన్ని పెంచటం, వాతావరణ విపత్తులపై జిల్లాల వారీగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థను రూపొందించటం, వ్యర్థాలను తిరిగి ఉపయోగంలోకి తేవటం, పర్యావరణహిత ఇంధన వనరుల అభివృద్ధిపై ఆరు స్పెషల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. డిసెంబర్ 8న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ముందస్తు ప్రణాళికతో పాటు వాతావరణ మార్పులను అధిగమించేందుకు తెలంగాణ ప్రత్యేక కార్యాచరణను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
60 మంది పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం
రాబోయే ఆరు నెలలు, ఏడాది, ఐదేండ్లలో చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరచనున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలకు నిర్దిష్ట బాధ్యతలను అప్పగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. డిసెంబర్ 9న 60 మంది పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ రంగాల్లో దాదాపు పది సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.డిసెంబర్ 7 నుంచి 9 వరకు 2,015 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అటవీ, పర్యావరణ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు సహా 49 సంస్థలు ఇందులో పాల్గొంటాయి. పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసులో బిగ్ బ్లాస్ట్.. డైరెక్టర్, ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అరెస్ట్!