Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయి. ప్రచండ భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండవేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నా.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు.
గురు, శుక్రవారాల్లో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీలు నమోదైంది.
ఏపీలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వడగాల్పులు వీస్తున్నాయి. చాలా చోట్ల గరిష్ట ఉష్టోగ్రతలు 42 డిగ్రీలు దాటేశాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎండ తీవ్రత తగ్గినా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో మరో కొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలంటున్నారు. వడదెబ్బబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.