Mlas Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించనుంది. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్ళారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే వ్యవహారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో ఉప ఎన్నిక రానుందా? ఖాయమని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోందా? శాసనసభ వ్యవహారాల్లోకి న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కొంత గడువు ఇస్తుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధం అవుతుందా? ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణలో పార్టీ మారిన పది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ తీర్పు వెల్లడించనుంది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
వారిలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలు పార్టీ మారారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టుకి వెళ్లారు. జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు పార్టీ ఫిరాయించారని కేటీఆర్‌తోపాటు కొందరు నేతలు రిట్ పిటిషన్ వేశారు.
ALSO READ: ఫ్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డులకు ఆహ్వానం, ముఖ్య అతిధులుగా మంత్రులు
ఆ పిటిషన్లపై వాదనలు జరుగుతుండగా మార్చిలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. మూడు పిటిషన్లను విచారించింది జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఏప్రిల్ 3న రిజర్వ్ చేసిన తీర్పును గురువారం వెల్లడించనుంది.
ఈ విషయంలో న్యాయస్థానం తీర్పు ఎలా ఇచ్చినా ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అసలు చిక్కు బీఆర్ఎస్‌కు మొదలుకానుందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఉపఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ పోటీకి దిగుతుందా? చెప్పడం కష్టమేనని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి ఎవరూ ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లకుండా వేసిన స్కెచ్‌గా చెబుతున్నారు. లేకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా సైలెంట్‌గా ఉంటుందా? అనేది చూడాలి.