తెలంగాణలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలో కూడా అవినీతి ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. ఈ మాట ఎవరో అన్నది కాదు.. స్వయానా ఓ ఐపీఎస్. అది కూడా తెలంగాణలో డేరింగ్ అండ్ డాషింగ్ ఐపీఎస్ అధికారిగా పేరుపొంది.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ ఈ ట్వీట్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌దా ఉంటూ.. నిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న సీవీ ఆనంద్.. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు చేసిన రిప్లై ఇప్పుడు చర్చకు తెరలేపింది.
దీనికి తోడు ఇటీవల ఏసీబీ స్పీడ్ పెంచింది. సింగరేణి నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సింగరేణిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ నియామకాల్లో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి సంస్థ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్టు తెలిసింది. నియామకాల పేరుతో డబ్బు వసూలు చేసిన పలువురు ఉద్యోగులను ఇప్పటికే సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై సింగరేణి ఎండీ బలరాం ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమేశ్ నేతృత్వంలో సింగరేణిలో నియామకాల పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
పశుసంవర్ధక శాఖలోని గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఫైళ్ల మాయంపై ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. కాంట్రాక్టర్‌తో కలిసి పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారులు, సిబ్బంది నిధులు గోల్‌మాల్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన 2 కోట్లు 20 లక్షల రూపాయలు దారి మళ్లినట్టు తేల్చారు.