Governor Speech: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు.
సామాజిక న్యాయం, సంక్షేమం పట్ల ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందులో భాగంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు గవర్నర్.
తెలంగాణ ప్రజల కలల సాకారానికి ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతోందన్నారు గవర్నర్. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని, ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని తెలిపారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నట్లు వివరించిన ఆయన, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నట్లు తెలిపారు.
ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్న గవర్నర్, రాష్ట్రానికి రైతులే ఆత్మగా వర్ణించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఉందన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న తెలంగాణ అని చెబుతూ అన్నదాతలకు రుణమాఫీ చేశామన్నారు. దాదాపు 23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించామని, మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
ALSO READ: టీటీడీ దర్శనాల ఇష్యూపై సీఎం చంద్రబాబుకు మంత్రి లేఖ
పాడి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్యూచర్ సిటీ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని వివరించారు. శ్రీశైలం – సాగర్ హైవే మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దీనికి కేటాయించామన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని, మెట్రో రైలు సౌకర్యం కూడా రాబోతుందని తెలిపారు గవర్నర్.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్న గవర్నర్, ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. రుణమాఫీ కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశామని, రూ. 500కే గ్యాస్ అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇక ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్న గవర్నర్, బీసీల రిజర్వేషన్ల కోసం కుల గణనను నిర్వహించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, దీని ఆధారంగా ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం టీజీపీఎస్సీని బలోపేతం చేశామని తన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యా రంగాన్ని కీలక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతోందన్నారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం సాగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలను గురువారం నాటికి వాయిదా పడ్డాయి.
గురువారం సభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. శుక్రవారం హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు. 15న ధన్యవాద తీర్మానంపై చర్చ కంటిన్యూ కానుంది. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ జరగనుంది. అలాగే 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ నిర్వహించనున్నారు. 19న వార్షిక బడ్జెట్‌ను ప్రవెశ పెట్టనున్న ప్రభుత్వం. 21న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఈనెల 29 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.