Bathukamma 2026:స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను ఈ ఏడు మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. శనివారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వేడుకల ఏర్పాట్లపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
18న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ ప్రాంగణం
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న జరిగే ‘సద్దుల బతుకమ్మ’ను కంటికి ఇంపేలా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు రంగురంగుల బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరి ట్యాంక్ బండ్ చేరుకుంటారు. వందలాది మంది జానపద కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక రూపాలు ఈ ఊరేగింపుకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేకంగా నిర్మించే వేదికపై ప్రజాప్రతినిధుల సమక్షంలో వేడుకలు జరగనున్నాయి.
విద్యుత్ కాంతులతో మెరిసిపోనున్న నగరం
పండగ శోభ ఉట్టిపడేలా హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో భారీ బతుకమ్మ నమూనాలను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రధాన జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ పండగను విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read: ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!