Chinese Fantasy Romantic Series: ఓ వైపు అమాయకమైన చిన్న ఫెయిరీ… మరోవైపు మూడు లోకాలనే వణికించే శక్తి ఉన్న భయంకరమైన డెవిల్. ఒకరినొకరు అస్సలు కలవకూడని ఈ ఇద్దరి జీవితాలు అనుకోకుండా ముడిపడితే ? అంతేకాదు… ఆ బంధమే చివరకు ప్రేమగా మారితే ? ఇలా ప్రేమ, శత్రుత్వం, మాయా శక్తులు, మూడు లోకాల భవిష్యత్తును వంటి అంశాలున్న ఆసక్తికరమైన ఫాంటసీ లవ్ స్టోరీ ‘లవ్ బిట్వీన్ ఫెయిరీ అండ్ డెవిల్’ (Love Between Fairy and Devil). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
మూన్ ట్రైబ్ కు చెందిన డోంగ్‌ఫాంగ్ క్వింగ్‌కాంగ్ సాధారణ డెవిల్ కాదు. అపారమైన శక్తిని సంపాదించాలనే కోరికతో తన తండ్రినే చంపి మూన్ సుప్రీమ్ స్థానాన్ని దక్కించుకుంటాడు. ఆ తర్వాత లక్ష మంది మూన్ ట్రైబ్ సైనికులతో యుద్ధాలు చేస్తూ మూడు లోకాలకూ ప్రమాదంగా మారతాడు. అతడి శక్తిని అడ్డుకునేందుకు మొదటి గాడ్ ఆఫ్ వార్ అతడిని హావ్టియన్ టవర్ లో బంధిస్తాడు. వేల సంవత్సరాల పాటు అక్కడే బంధీ అయి ఉంటాడు. దాదాపు 30 వేల ఏళ్ల తర్వాత షావో లాన్ హువా అనే అమాయకమైన చిన్న ఫెయిరీ అనుకోకుండా ఆ సీల్‌ను బ్రేక్ చేస్తుంది. దీంతో డోంగ్‌ఫాంగ్ క్వింగ్‌కాంగ్ మళ్లీ బయటకు వస్తాడు. మొదట అతడి లక్ష్యం తన శక్తిని తిరిగి సంపాదించుకోవడం, తనపై ఉన్న బంధనాల నుంచి బయటపడటమే. కానీ ఆ సమయంలో లాన్ హువాతో అతడికి ఊహించని బంధం ఏర్పడుతుంది.
డోంగ్‌ఫాంగ్ శరీరంలో ఉన్న శాపం నుంచి పూర్తిగా బయటపడాలంటే లాన్ హువా ఆత్మ అతడికి అవసరం అవుతుంది. ఈ కారణంగానే మొదట ఆమెను తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని భావిస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇద్దరి ఆత్మలు ఒకదానితో ఒకటి మారిపోతాయి. దీంతో ఒకరి భావాలు మరొకరికి అనుభూతి చెందే పరిస్థితి ఏర్పడుతుంది. భయంకరమైన డెవిల్ అమాయకమైన ఫెయిరీ ప్రపంచాన్ని చూడటం మొదలవుతుంది.. లాన్ హువాకు మాత్రం డోంగ్‌ఫాంగ్‌లో దాగి ఉన్న మరో మనిషి కనిపిస్తాడు.
ఇలా మొదట అవసరం కోసం ఏర్పడిన బంధం క్రమంగా అనుబంధంగా మారుతుంది. లాన్ హువా డోంగ్‌ఫాంగ్‌లోని కోపం, ఒంటరితనం, గత గాయాలను అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది. ఆమె అమాయకత్వం, దయ అతడి ఆలోచనలను కూడా మార్చడం మొదలుపెడతాయి. కానీ వీళ్ల ప్రేమకు మరోవైపు మూడు లోకాల మధ్య ఉన్న పాత శత్రుత్వాలు, యుద్ధాలు, దాగి ఉన్న కుట్రలు అడ్డుగా నిలుస్తాయి.
డోంగ్‌ఫాంగ్ నిజంగా లాన్ హువాను ప్రేమిస్తున్నాడా ? లేక ఆమెను తన శక్తి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడా ? తన గతం, ప్రతీకారం, అధికారాన్ని పక్కనపెట్టి ఈ ఫెయిరీ కోసం డెవిల్ మారగలడా ? వీళ్ల ప్రేమ మూడు లోకాల మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపగలదా ? చివరకు డోంగ్‌ఫాంగ్, లాన్ హువా బంధానికి ఎలాంటి ముగింపు వస్తుందనేదే ఈ ఫాంటసీ సిరీస్‌లో చూడాల్సిన ఆసక్తికరమైన కథ.
యు షు షిన్ (Yu Shu Xin), డైలాన్ వాంగ్ (Dylan Wang), జాంగ్ లింగ్ హీ (Zhang Ling He), జు హైకియావో (Xu Haiqiao), క్రిస్టీ గువో (Cristy Guo) తదితరులు నటించిన ఈ చైనీస్ ఫాంటసీ రొమాన్స్ సిరీస్‌కు యీ జెంగ్ (Yi Zheng), కియాన్ జింగ్ వు (Qian Jing Wu) దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ సిరీస్‌కు మొత్తం 36 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ‘లవ్ బిట్వీన్ ఫెయిరీ అండ్ డెవిల్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో ఉంది. తెలుగు ఆడియో లేదు. హిందీ, చైనీస్ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ సిరీస్‌ను తెలుగు డబ్బింగ్‌లో చూడలేరు.
Read Also: డేటింగ్ యాప్ ఫౌండర్ కు డేరింగ్ ఛాలెంజ్… ఓటీటీలోకి తెలుగులో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ సిరీస్