Telangana Bhu Bharathi: ఈ నెల 14 న భూ భారతి పోర్టల్ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేపు లాంఛనంగా ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేశారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉండబోతున్నదని ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.
ప్రారంభోత్సవం తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి మూడు మండలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఆయా మండలాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ సులభమైన భాషలో ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ పోర్టల్ ను అప్‌డేట్ చేయాలన్నారు.
వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టం గా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలోని ఎంపిక చేసిన మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టును రెవెన్యూ శాఖ నిర్వహించనున్నది. భూభారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఆ బాధ్యత కలెక్టర్లదే అని సీఎం చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకొని అమలు చేయాలని సూచించారు. తక్కువ సమయంలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరు అర్థం చేసుకునేలా, ఈజీగా సరళమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు సీఎం. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని, వారి అనుమానాలను నివృత్తి చేయాలని ఆదేశించారు రేవంత్‌రెడ్డి.
Also Read: ఆ భూములు సర్కార్‌వే.. కంచ గచ్చిబౌలి భూములపై.. రెవెన్యూ అధికారుల క్లారిటీ
పైలెట్ ప్రాజెక్టులు విజయవంతమైన తర్వాత.. ప్రతీ మండలాల్లో భూ భారతి పోర్టల్‌పై సదస్సు నిర్వహిస్తారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పోర్టల్ గురించి రైతులకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. భూ భారతి ఎలా పనిచేస్తుంది ? భూమి వివరాలు ఎలా తెలుసుకోవాలి ? ఏదైనా సమస్య వస్తే ఎలా ఫిర్యాదు చేయాలి..? ఇలా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు అధికారులు.
భూ భారతిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ధరణిలో జరిగిన మిస్టేక్స్ ఇందులో రిపీట్ కాకుండా చూసుకుంది. యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించింది. కొత్త సమస్యలకు కారణం కావొద్దని సీరియస్‌గా చెప్పింది. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలకు భూ భారతి ద్వారా చెక్ పెట్టాలని సూచించింది సర్కార్. పోర్టల్‌తో పాటు యాప్ కూడా తీసుకొస్తోంది.
కాగా.. భూమి సమస్యలన్నింటికీ భూభారతితో చెక్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. భూభారతిపై చిట్‌చాట్ చేసిన ఆయన.. ధరణి పేరుతో జరిగిన అక్రమాలన్నీ ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ తయారు చేసినట్లు చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాకో మూడు మండలాల్లో అమలు చేయబోతున్నట్లు వివరించారు మంత్రి. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా తయారు చేశామన్నారు. 3 నెలల్లో విధివిధానాలు రూపొందించామని తెలిపారు. 2020 చట్టంలో సాదాబైనామాల అంశం లేదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపిస్తామంటేనే కాంగ్రెస్‌ను గెలిపించారని గుర్తు చేశారు పొంగులేటి. 12 లక్షల ఎకరాలను పార్ట్-Bలో క్లియర్ చేయబోతున్నామని వివరించారు.