Trump Indians Penalty| అమెరికాలోని భారతీయులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రీన్‌కార్డు, హెచ్1బీ వీసా దారులలో అక్కడ ఎక్కువ శాతం చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులను నిరంతరం ఏదో ఒక మెలిక పెట్టి వేధిస్తున్నారు.
తాజాగా, ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠిన నిబంధనల ప్రకారం.. అమెరికాలో ఉన్న విదేశీయులు తమ గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాల్సిందేనని అధికారలు స్పష్టం చేశారు. ఈ నిబంధన ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారీ జరిమానాలు, కఠినచర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ నిబంధనలు.. అమెరికాలో అక్రమంగా ప్రవేశించి నివసించే వలసదారులను గుర్తించడం కోసమే తీసుకువచ్చామని అధికారులు చెబుతుండగా.. ఇటీవలే అక్కడి న్యాయస్థానాలు కూడా ఇందుకు అనుమతులిచ్చాయి. 18 ఏళ్లు దాటిన, అమెరికా పౌరసత్వం లేని విదేశీయులు, అక్కడ వారి చట్టబద్ధమైన గుర్తింపు కార్డులను తమ వెంట ఎల్లప్పుడూ అంటే 24 గంటలూ పెట్టుకునే ఉండాలి. వారు అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్నట్లుగా అడిగిన వెంటనే తనిఖీ చేసే అధికారులకు చూపించాలి.
ఇదేమీ కొత్త నియమం కాదు. కానీ, ఇది విదేశీయుల నమోదు చట్టం 1940లో భాగంగా ఉంది. అయితే ఈ స్థాయిలో కఠినంగా దీన్ని ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వాలు అమలు చేయలేదు. అయితే కోర్టు అనుమతితో, ముఖ్యంగా అక్రమంగా ఉన్న వలసదారులను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ సర్కారు ఇప్పుడు ఈ నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలని నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిగా ఉన్న క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం.. వీరిలో సుమారు 2.2 లక్షల మంది అక్రమంగా నివసిస్తున్నారు. లేదా వీరి వీసాల గడువు ముగిసింది. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీసా గడువు ముగిసిన వారి శాతం కేవలం 2 శాతం మాత్రమే.
Also Read: వేల కోట్ల పెట్టుబడులను తిరస్కరించిన ఇండియా.. ఎందుకంటే?
కొత్త నిబంధనలు :
అమెరికాలోకి వలసవచ్చిన విదేశీయులు, వారు 30 రోజులకు మించి అక్కడ ఉండాలనుకుంటే, తప్పనిసరిగా తమ వీసా లేదా గుర్తింపు పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేసినప్పుడు, వాళ్లు అడిగితే వెంటనే చూపించాలి. అందుకు విఫలమైతే జరిమానాలతో పాటు కఠినమైన శిక్షలు విధించబడతాయి.
ఈ నియమం ప్రకారం.. అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఐడీ కార్డును ఎప్పటికీ వెంట ఉంచుకోవాలి. అంతేకాకుండా, 14 ఏళ్లు నిండిన టీనేజర్ల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించాలి. 14వ పుట్టినరోజుకు ముందు వారు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నా.. మళ్లీ సరికొత్తగా నమోదు చేయించి, వేలిముద్రల వంటి బయోమెట్రిక్ వివరాలను సమర్పించాలి. దీనికోసం 325 ఆర్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ఈ ప్రక్రియను 30 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేసినా అరెస్ట్ చేసే అవకాశం..
రిరిజిస్ట్రేషన్ చేసినా.. అనుమతులు లేకుండా ఉన్న వలసదారులను అమెరికాలో ఉంచే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ చర్యల ముఖ్య ఉద్దేశం వారి అసలైన సంఖ్యను గుర్తించడమే. రిజిస్ట్రేషన్ సమయంలో కొత్త చిరునామా, వ్యక్తిగత, కుటుంబ సంబంధిత వివరాలను ఇచ్చేవారు అవి నిజమైనవేనని నిర్ధారణ చేయించాలి. ఎటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా అమెరికా నుంచి పంపించడం బదులుగా జైలుశిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత కూడా పేర్లు నమోదు చేయకపోతే, తనిఖీల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు విధించబడతాయి. పైగా, ఆరు నెలల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
తప్పుడు చిరునామా ఇస్తే భారీ జరిమానా:
గ్రీన్‌కార్డు లేదా వీసా కలిగినవారు తమ నివాసాన్ని మారిస్తే.. కొత్త చిరునామా సమాచారాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. 10 రోజుల్లోపు ఈ సమాచారం ఇవ్వకపోతే, వారు 5,000 డాలర్ల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.