Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే.. కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 కోట్లకు పైగా రేషన్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా.. ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తోంది. గతంలో 2 కోట్ల 80 లక్షలుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదనంగా 62 లక్షల మందికి రేషన్ కార్డులు అందజేశారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఈ పంపిణీ ప్రక్రియను చేపడతారు.
రైతులకు క్వింటాలుకు 500 బోనస్..
ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ కేంద్రంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సమ్మిట్ ఏర్పాట్ల కోసం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా.. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం ఇప్పటివరకు 81 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వడ్లను కొనుగోలు చేసింది. ఏడు రకాల సన్న ధాన్యాలు వేసిన రైతులకు క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, మిగులుగా ఉన్న 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించడానికి కేబినెట్ అంగీకరించింది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,100 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఒక్కో ఆటోకు లక్షన్నర సబ్సిడీ..
రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే మరో 7 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు, ఏడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు 200 కోట్లు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో పొల్యూషన్ కంట్రోల్‌లో భాగంగా.. డీజిల్, పెట్రోల్‌తో నడిచే దాదాపు 19 వేల ఆటోలను.. ఈవీలుగా మార్చేందుకు 200 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తెచ్చారు. ఒక్కో ఆటోకు లక్షన్నర సబ్సిడీ అందించనున్నారు. నగరంలోని పరిశ్రమలను బయటకు తరలించేందుకు తెచ్చిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు.
Also Read: తిరుపతి స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!