Power DISCOM: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రిడ్ అండ్ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రస్తుతం అంతర్గత సవాళ్లతో సతమతమవుతోంది. సంస్థ ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకముందే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు సంస్థ నిర్మాణ దశలోనే ఉండగా, మరోవైపు విద్యుత్ సంఘాల నాయకుల పెత్తనం, బదిలీల చుట్టూ జరుగుతున్న బేరసారాలు చర్చనీయాంశంగా మారాయి. రైతు డిస్కంలో కీలక స్థానాల కోసం విద్యుత్ సంఘాల నాయకులు తెర వెనుక భారీగా బేరసారాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తమకు అనుకూలమైన వారు, లేదా ముడుపులు చెల్లించే వారికి ప్రాధాన్యత ఉండేలా పైస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రతిభ ఉన్నా, పైరవీలు లేని అధికారులు వెనుకబడిపోతున్నారనే చర్చ జరుగుతోంది. కొత్త డిస్కమ్‌లోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్న సమర్థులైన సిబ్బందిని సంఘాల నాయకులు అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ‘అక్కడ భవిష్యత్తు ఉండదు ప్రమోషన్లు రావు వంటి అపోహలను సృష్టిస్తూ, తమ వర్గం వారిని మాత్రమే పంపేలా వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల సంస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఏర్పడుతోంది.
విద్యుత్ సంస్థలో ఉద్యోగ సంఘాల నాయకుల రెండు నాలుకల ధోరణిని వ్యవహరిస్తున్నారు. రైతు డిస్కంకు అవసరమైన ఇంజినీర్లను, ఉద్యోగులను ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి తీసుకునేలా ప్రభుత్వ జీవో ఉంది. అయితే హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆర్పీడీసీఎల్ కు వెళ్లనీయకుండా పలు విద్యుత్ సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. మరోపక్క జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులను హైదరాబాద్ కు పంపిస్తామని దందాకు తెరతీసీనట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also read: ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
వాస్తవానికి నిర్మాణ దశలో ఉన్న రైతు డిస్కం కార్పొరేట్ ఆఫీస్ కు అనుభవజ్ఞలుంటే బాగుంటుందని సంస్థ అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేపట్టింది. కానీ అందుకు విరుద్ధంగా అవసరమున్న ఇంజినీర్లు, ఉద్యోగులను రానివ్వకుండా కొన్ని సంఘాలు తమ పబ్బం గడుపుకునేందుకు అడ్డుపడుతున్నాయని సమాచారం. దక్షిణ డిస్కం యాజమాన్యం.. ఎంప్లాయిస్ రైతు డిస్కంకు వెళ్లడం వారి స్వచ్ఛంద నిర్ణయమని చెబుతోంది. రైతు డిస్కం ఈనెల 1 నుంచి మనుగడలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుండి చకా చకా అనుమతులు అందుకున్న ప్రభుత్వ డిస్కం, సరిపడా సిబ్బంది, అధికారులు, సౌకర్యాల లేమితో అనుకున్న స్థాయిలో మాత్రం ముందుకు వెళ్లలేక పోతుంది.
దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) నుంచి ఆశించిన స్థాయిలో సిబ్బంది కొత్త డిస్కమ్‌లో చేరడం లేదని గణాంకాంలు చెబుతున్నాయి. ఎస్పీడీసీఎల్ నుంచి 55 మంది అధికారులు అవసరమని ఆర్పీడీసీఎల్.. ఎస్పీడీసీఎల్ ను కోరింది. అయితే అందుకు అనుగుణంగా ముందడుగు పడలేదని తెలుస్తోంది. 55 మందిని కోరితే 39 మంది ఉద్యోగులు మాత్రమే ముందుకు వచ్చినట్లు సమాచారం. 39 మందిలో కూడా ఆర్పీడీసీఎల్ కోరని, కార్పొరేట్ స్ట్రక్చరింగ్ లో అంతగా అనుభవం లేని ఇంజినీర్లను అలాట్ చేశారన్న ఆరోపణలున్నాయి.
Also read: BRS : కేసీఆర్ గుర్తులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయా?
28 మంది ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈల అవసరముందని కోరగా అందులో కేవలం 10 మంది ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాట్ చేసిన 39 మందిలో కూడా దాదాపు 20 మంది రిపోర్ట్ చేయనట్లుగా తెలిసింది. పలువురికి రిలీవ్ ఆర్డర్లు ఇచ్చినా రిపోర్ట్ చేయలేదని సమాచారం. ఎందుకంటే కొత్త సంస్థలో సర్వీస్ నిబంధనలు ఎలా ఉంటాయో అన్న భయంతో చాలామంది చేరడానికి వెనకాడుతున్నట్లు సమాచారం. ఆర్పీడీసీఎల్ పై వస్తున్న పలు అపోహల కారణంగా చేరకుండా వెనుకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇకపోతే ఎన్పీడీసీఎల్ నుంచి 12 మంది ఉద్యోగుల అవసరమని కోరగా అక్కడి నుంచి పూర్తిస్థాయిలో వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
రైతు డిస్కమ్‌కు ప్రత్యేక ఆదాయం లేకపోవడం(ప్రభుత్వ సబ్సిడీలే ఆధారం కావడంతో) జీతాలు సకాలంలో అందుతాయా? అన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. కొత్త డిస్కమ్‌లో చేరితే సీనియారిటీ సమస్యలు తలెత్తుతాయన్న ప్రచారం కూడా ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ అపోహలపై ఎస్పీడీసీఎల్ క్లారిటీ ఇచ్చింది. వాస్తవ పరిస్థితులను ఆర్పీడీసీఎల్ వివరించింది. రైతు విద్యుత్ డిస్కం కూడా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ పంపిణీ సంస్థల మాదిరిగానే వ్యవస్థలో భాగంగా పనిచేస్తుందని స్పష్టంచేసింది.
ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థల ఉద్యోగుల విధంగానే సమానంగా అందుతాయని పేర్కొంది. ప్రస్తుత నెలకు సంబంధించిన జీతాలు కూడా ఇతర విద్యుత్ సంస్థలతో పాటు సమకాలంలోనే విడుదల చేసినట్లు వెల్లడించింది. రైతు విద్యుత్ డిస్కం (టీజీఆర్‌పీడీసీఎల్) కూడా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో భాగమై, అన్ని విధాలుగా సమాన నిబంధనలు, ఆర్థిక లాభాలు అమలు చేస్తోందని క్లారిటీ ఇచ్చింది. రైతులకు మేలు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరాలంటే, విద్యుత్ సంఘాల జోక్యాన్ని తగ్గించి, పారదర్శకమైన నియామకాలు, బదిలీల ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also read: పురుషుడైనా సత్యభామ వయ్యారం ఆయనకే సొంతం?