Telangana formation day: అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్-నైటా ఆధ్వర్యంలో ఆవతరణ వేడుకలతోపాటు బాలోత్సవ్‌ను నిర్వహించారు.
బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో సిటీలో ఉంటున్న తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు.
నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్ లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు.
నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ALSO READ: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ, ఎందుకని?