Waist Size Heart Health| ఈ రోజుల్లో, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చొని ఉండే జీవనశైలి, పని ఒత్తిడి వంటివి సాధారణమైపోయాయి. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం, ప్రాసెస్ చేసిన ఫాస్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం (ఒబెసిటీ) సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం శరీర బరువు గురించి మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక తీవ్ర ఆరోగ్య సమస్యగా మారింది. ఈ సమస్య గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు కూడా దారితీస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో 65 కోట్ల మంది పెద్దలు, 34 కోట్ల మంది యువకులు, 3.9 కోట్ల మంది చిన్నారులు ఉన్నారు.
సాధారణంగా.. బరువు, ఆరోగ్య సమస్యలను అంచనా వేయడానికి బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని ఉపయోగిస్తారు. కానీ, బెల్గ్రేడ్‌లో జరిగిన హార్ట్ ఫెయిల్యూర్ 2025 కాంగ్రెస్ సమావేశంలో.. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త అధ్యయనం ప్రకారం.. నడుము కొలత – శరీర ఎత్తు నిష్పత్తి (waist-to-height ratio) గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా సూచిస్తుందని తెలిపారు. నడుము చుట్టూ కొవ్వు (విసెరల్ ఫ్యాట్) శరీరంలోని ఇతర భాగాల కొవ్వు కంటే గుండె జబ్బులకు ఎక్కువగా కారణమవుతుందని వారు కనుగొన్నారు.
అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలు ఇవే..
స్వీడన్‌లోని మాల్మో ప్రివెంటివ్ ప్రాజెక్ట్‌లో 45-73 సంవత్సరాల వయస్సు గల 1,792 మందిని 12.6 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. రక్తంలో చక్కెర స్థాయిల ఆధారంగా వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. సాధారణ (ఆరోగ్యవంతులు) , ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్. ఈ కాలంలో 132 మందికి గుండె వైఫల్యం సంభవించింది. అధ్యయనంలో కీలకమైన విషయం ఏమిటంటే.. బాడీ మాస్ ఇండెక్స్ కంటే నడుము కొలత-ఎత్తు నిష్పత్తి, గుండె వైఫల్యంతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది.
డాక్టర్ అమ్రా జుజిచ్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. “బాడీ మాస్ ఇండెక్స్ (BMI) శరీరంలో కొవ్వు ఎక్కడ ఉందో చెప్పదు, కానీ నడుము చుట్టూ ఉండే కొవ్వు గుండెకు ఎక్కువ హాని కలిగిస్తుంది.”
ఆరోగ్యకరమైన నడుము సైజు ఎంత?
డాక్టర్ జాన్ మోల్విన్ ఇలా సూచించారు.. “మీ నడుము కొలత మీ ఎత్తులో సగం కంటే తక్కువగా ఉండాలి.” ఉదాహరణకు, మీరు 170 సెం.మీ. ఎత్తు ఉంటే, మీ నడుము 85 సెం.మీ. కంటే తక్కువగా ఉండాలి.
Also Read: షుగర్ పేషంట్లు రోజూ ఎంత దూరం నడవాలి?.. సరైన సమయం ఏదో తెలుసా?
ఈ అధ్యయనం బరువు కంటే నడుము చుట్టూ ఉండే కొవ్వుపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి నడుము కొలతను రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగం చేయాలని నిపుణులు చెబుతున్నారు. నడుము చుట్టూ కొవ్వును నియంత్రించడం ద్వారా గుండె వైఫల్యాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ ద్వారా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.