Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణంగా గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్తగా, ప్రధానిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా మన్మోహన్ సింగ్ ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు.
మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలిసిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా పలు రాష్ట్రాలు సీఎంలు మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ తమ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి ఆర్థిక వేత్తను దేశం కోల్పోయిందని ఈ సందర్భంగా మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తెలంగాణలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారం రోజులపాటు సంతాపదినాలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నేడు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇతర మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ లు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు.