Sabapathy Dekshinamurthy: తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ అయిన సభాపతి దక్షిణామూర్తి అలియాస్ ఎస్‌డీ సభా.. తన 61 ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలను డైరెక్ట్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సభాపతి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల కన్నుమూశారు. దీంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా సభాపతి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. దర్శకుడిగా సభాపతి దక్షిణామూర్తి తెరకెక్కించిన సినిమాలు కొన్నే అయినా.. వాటిని ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సాధించారు.
స్పీడ్ తగ్గింది
కోలీవుడ్‌లో సభాపతి దక్షిణామూర్తిని ఎస్‌డీ సభా, సభాపతి, సభా ఖైలాష్ అని కూడా పిలుచుకుంటారు. 1992లో ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. విజయకాంత్ హీరోగా నటించిన ‘భారతన్’ అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయన ప్రయాణం మొదలయ్యింది. 1993లో ప్రశాంత్, శుభశ్రీ కాంబినేషన్‌లో ‘ఎంగ తంబి’ అనే మూవీని తెరకెక్కించారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే సభాపతి నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రావడంతో ఆయన మిగతా కెరీర్ కూడా ఇలాగే స్పీడ్‌గా సాగిపోతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ‘ఎంగ తంబి’ తర్వాత ఆయన మరొక చిత్రం తెరకెక్కించడానికి మూడేళ్లు పట్టింది.
Also Read: అల్లు అర్జున్ ఈగో.. సీఎం ముందు ఇండస్ట్రీ తలవంచేలా చేసింది
తెలుగులో కూడా
ఆరోజుల్లో ఉన్న చాలామంది దర్శకులలాగా కాకుండా కాస్త డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ప్రయత్నించేవారు సభాపతి దక్షిణామూర్తి. అందులో భాగంగానే ‘సుందర పురుషాన్’, ‘వీఐపీ’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అలా దర్శకుడిగా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా అవకాశం దొరికిన ప్రతీసారి తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. అలా వరుసగా అరడజనుకు పైగా తమిళ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన తెలుగులో కూడా అడుగుపెట్టారు. జగపతి బాబు, కళ్యాణి కాంబినేషన్‌లో ‘పందెం’ అనే మూవీని తెరకెక్కించి నేరుగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు సభాపతి దక్షిణామూర్తి.
సౌత్ భాషల్లో సినిమాలు
అప్పట్లో జగపతి బాబు, కళ్యాణి కలిసి నటించారంటే ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని నమ్మకం ఉండేది. అదే విధంగా వారిద్దరినీ హీరోహీరోయిన్‌గా ఎంపిక చేసుకొని 2005లో ‘పందెం’ (Pandem) అనే మూవీతో వచ్చారు సభాపతి దక్షిణామూర్తి. ఈ సినిమా కాస్త పరవాలేదనిపించింది. తమిళ, తెలుగులో గుర్తింపు రావడంతో ఆయన చూపు కన్నడ ఇండస్ట్రీపై పడింది. 2011లో ‘జాలీ బాయ్’ అనే సినిమాను డైరెక్ట్ చేసి శాండిల్‌వుడ్‌లో కూడా అడుగుపెట్టారు. అదే ఆయన చివరి సినిమా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా ఒక భాషకే పరిమితం అయిపోకుండా దర్శకుడిగా దాదాపుగా ప్రతీ సౌత్ ఇండస్ట్రీని కవర్ చేశారు సభాపతి దక్షిణామూర్తి (Sabapathy Dekshinamurthy). ఆయన డైరెక్షన్‌లో నటించిన నటీనటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.