Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంలో ప్రభుత్వం తదుపరి అడుగు ఎలా వేయబోతోందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కోర్టు తీర్పు వెలువడినప్పటికీ, దానికి సంబంధించిన అధికారిక ఆర్డర్ కాపీ ఇప్పటివరకు ప్రభుత్వానికి అందలేదు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తీర్పు ప్రతి చేతికి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సీఎం రేవంత్ వచ్చాకే నిర్ణయం!
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాతే రంగనాథ్ అంశంపై ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి రానుంది. అధికారుల నియామకం, కేటాయింపుల విషయంలో పూర్తి విచక్షణాధికారం ప్రభుత్వానిదేనని ఢిల్లీ వేదికగా సీఎం ఇప్పటికే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో, సీఎం నగరానికి రాగానే ఉన్నతాధికారులతో నిర్వహించే భేటీలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
న్యాయ శాఖ అధికారులతో సీఎస్ సంజయ్ జాజు భేటీ
మరోవైపు, ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. న్యాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోర్టు తీర్పు వెనుక ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. తీర్పు ప్రతి చేతికి వచ్చిన వెంటనే దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తదుపరి లీగల్ ప్రాసెస్ ఎలా ఉండాలనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు.
డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే ఆలోచనలో ప్రభుత్వం?
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అంశంపై కూడా ప్రభుత్వ వర్గాల్లో సీరియస్‌గా చర్చ నడుస్తోంది. అధికారుల బదిలీలు, నియామకాలపై ప్రభుత్వ హక్కులను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు డివిజన్ బెంచ్‌కు వెళ్లడమే సరైన మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తొందరపాటు వద్దు.. చట్టబద్ధంగానే ముందడుగు!
రంగనాథ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదనే స్పష్టమైన వ్యూహంతో ఉంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, చట్టబద్ధంగా ఉన్న అన్ని లీగల్ ఆప్షన్లను వాడుకోవాలని భావిస్తోంది. ఆర్డర్ కాపీ అందిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రభుత్వం తన తదుపరి కార్యాచరణను అధికారికంగా వెల్లడించనుంది.
Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘మీనాక్షి’ మార్క్ పోస్ట్‌మార్టం.. అధిష్ఠానం చేతిలో మంత్రుల జాతకాలు!