RTC Metro Pass: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపరీతంగా ఉన్న ఛార్జీలపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ధరల తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా స్పష్టతనిచ్చారు.
భారంగా మారిన పాస్‌లు!
కొత్తగా ప్రవేశపెట్టిన కామన్ పాస్ విధానం సామాన్యులకు భారంలా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రోజువారీ పాస్ ధరను రూ.400గా నిర్ణయించగా, అందులో మెట్రో వాటా రూ.300 కాగా, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. ఇక నెలవారీ కామన్ పాస్ విషయానికి వస్తే దీని ధర ఏకంగా రూ.8,500గా పెట్టారు. ఇందులో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500 కేటాయించారు. ఈ భారీ ధరల కారణంగా ప్రయాణికుల నుంచి కనీస స్పందన కూడా కరువైంది.
ఉప ముఖ్యమంత్రి సూచనతో కీలక సమీక్ష
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, తీవ్ర వ్యతిరేకతను గమనించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన సూచనల మేరకు త్వరలోనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రయాణికులకు ఆర్టీసీ, మెట్రో సేవలు మరింత సులువుగా, అందుబాటు ధరల్లో లభించేలా కామన్ పాస్ ఛార్జీలను పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సామాన్యుల నడ్డి విరవకుండా, ఎవరికీ భారంగా అనిపించని రీతిలో కొత్త, సౌకర్యవంతమైన ధరలను త్వరలోనే ఖరారు చేయనున్నారు.
Also Read: బీసీల ఎదుగుదల జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి