BC Reservations: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ, అధికార కూటమి నేతలు ప్రతిపక్షాలపై మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
బీసీల ఎదుగుదలే లక్ష్యంగా కూటమి కృషి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు బీసీలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని మంత్రి జనార్ధన రెడ్డి గుర్తుచేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో బీసీలకు దాదాపు 40 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అయితే, బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం జగన్‌కు ఇష్టం లేదని, అందుకే రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు వేస్తూ వారిని అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ వెంటే ఉంటారనే కక్షతోనే వైకాపా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని మంత్రి విమర్శించారు. కేవలం బటన్ నొక్కడం మినహా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ మిషన్ కింద రూ. 30 వేల కోట్ల టెండర్లు పిలిచి, ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. అమరావతి రాజధానిని పరుగులు పెట్టిస్తూ 2028 నాటికి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు.
అవినీతిపై చర్చకు సిద్దం
వైకాపా హయాంలో జరిగిన అవినీతి, మద్యం కుంభకోణాలపై అరెస్టుల పర్వం కొనసాగుతుందని జనార్ధన రెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనేందుకు ఆధారాలున్నాయని ఆరోపించారు. డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల నాయత్వంలో పనిచేస్తున్న కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
Also Read: మానవ హక్కుల కమిషన్ నియామకాల్లో తొందరెందుకు? చంద్రబాబుకు బొత్స లేఖ