Women Petrol: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసింది. మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లోని హకీంపేట గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇంధన ట్యాంకుల ఇన్‌స్టాలేషన్ పనులు కొనసాగుతున్నాయి. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ప్రారంభించే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు.
రాష్ట్రంలోని 39 ప్రాంతాల్లో మహిళా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల సహకారంతో భూముల గుర్తింపు, లీజు ఒప్పందాలు, ఎన్‌ఓసీలు, లేఅవుట్లు, అడ్వాన్స్ పొజెషన్, ట్యాంకుల ఇన్‌స్టాలేషన్ వంటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నల్లగొండ జిల్లా గందవారిగూడెంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకు స్థలంలో ట్యాంకుల ఏర్పాటు పూర్తైంది. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా భూపతిపురంలో కూడా ట్యాంకుల ఇన్‌స్టాలేషన్ పూర్తికాగా, ఇతర పనులు చేపడుతున్నారు. ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం, కొమురం భీం, హనుమకొండ జిల్లాల్లో భూమి లెవలింగ్, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అవసరమైన అన్ని ఎన్‌ఓసీలు పూర్తికాగా, కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లీజు ఒప్పందాలు, తుది అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారులు, ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతం నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో.. జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో మహిళా పెట్రోల్ బంకులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ బంకుల ద్వారా పది మందికి పైగా మహిళలకు ఉపాధి లభించడంతో పాటు, ప్రతి నెల సుమారు రూ.7లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. మహిళా సంఘాలే పెట్రోల్ బంకులను నిర్వహించడం దేశవ్యాప్తంగా ప్రత్యేక మోడల్‌గా నిలుస్తోంది.చమురు కంపెనీలు, వినియోగదారుల నుంచి కూడా మహిళా పెట్రోల్ బంకులకు మంచి స్పందన లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సేవల నాణ్యతా, నిర్వహణ విధానంపై సంతృప్తి వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నమూనాను మరిన్ని జిల్లాలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లా కేంద్రాల్లో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటయ్యాక, నియోజకవర్గ స్థాయిలో బంకులను ఏర్పాటు చేసే దిశగా అధికారులు కార్యచరణ సిద్దం చేస్తున్నారు.
Also read: బండి బగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాధితురాలి తల్లి లేఖ వెనుక సంచలనాలు.. ఇరుకుంటున్న పెద్దలు
మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న బంకుల ఏర్పాటు ప్రాజెక్టుపై అధికారులు మంత్రి సీతక్కకు సమగ్ర నివేదిక అందజేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్‌కు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టర్లు, సెర్ప్ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి అనుమతులు, నిర్మాణ పనులు, ట్యాంకుల ఏర్పాటు వంటి అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వం మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా మాత్రమే కాకుండా ఆర్థికంగా బలమైన సామాజిక శక్తులుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మార్చగలరనే నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళా పెట్రోల్ బంకులు గ్రామీణ మహిళలకు దీర్ఘకాలిక ఆదాయ వనరులు కల్పించే మోడల్‌గా నిలుస్తున్నాయి.నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన విజయాలు రాష్ట్రానికి ఆదర్శంగా మారాయి. అదే స్ఫూర్తితో ప్రతి జిల్లాలో మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.
Also read: సర్కారు భూములకు ఫుల్ డిమాండ్.. ఓక్కరోజులోనే రూ.83 కోట్ల ఆదాయం!