GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ గా కొనసాగిస్తారా? లేక మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారా? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు సర్కారు తెర దింపింది. ముందుగా ఊహించిన విధంగానే జీహెచ్ఎసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విలీనం తర్వాత 2 వేల 53 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన జీహెచ్ఎంసీలోని మొత్తం 300 వార్డుల్లో శంషాబాద్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని 150 వార్డులతో జీహెచ్ఎంసీగా, మిగిలిన 150 వార్డుల్లో 76 వార్డులతో శేరిలింగంపల్లి జోన్‌గా, మరో 74 వార్డులతో మల్కాజ్ గిరి జోన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికార వికేంద్రీకరణ, సుపరిపాలన, మెరుగైన పౌర, అత్యవసర సేవల నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్టయింది. ముఖ్యంగా ఎక్కడి ఆదాయం అక్కడే ఖర్చు పెట్టేలా ఈ కార్పొరేషన్ల విభజన జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
జోనల్ కమిషనర్లకు అధికారాలను పెంచుతూ ఇటీవలే మున్సిపల్ చట్టంలో సర్కారు సవరణలు కూడా చేసిన సంగతి తెల్సిందే. శంషాబాద్ వరకు 150 వార్డులతో విస్తరించిన జీహెచ్ఎంసీని సర్కారు ఉత్తర్వుల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా, మిగిలిన 150 వార్డులతో మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి జోన్లుగా విభజించగా, జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వీటికి మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)గా నామకరణం చేశారు. నిన్నటి వరకు సైబరాబాద్, మల్కాజ్ గిరి జోన్లకు అదనపు కమిషనర్లుగా వ్యవహారించిన సృజన, వినయ్ కృష్ణా రెడ్డిలను ఆ కార్పొరేషన్లకు మున్సిపల్ కమిషనర్లుగా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. వీరు బుధవారం ఉదయం ఎనిమిది గంటల కల్లా బాధ్యతలను స్వీకరించారు.
మూడు కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ పెద్దన్నయ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. తాజాగా చేసిన విభజనతో నిన్నమొన్నటి వరకు సుమారు 2 వేల 53 కిలోమీటర్ల మేరకు పెరిగిన జీహెచ్ఎంసీ విస్తీర్ణం ఇపుడు 680 చదరపు కిలోమీటర్లకు పరిమితమైంది. గత నవంబర్ 25 తేదీకి ముందు జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్లుండగా, విలీనం, పునర్విభజన, మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత జీహెచ్ఎంసీ విస్తీర్ణం కేవలం 30 చదరపు కిలోమీటర్లు మాత్రమే పెరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాంతాన్ని విస్తరించి కొత్తగా జీహెచ్ఎంసీని ఏర్పాటు చేసేలా విభజన జరిగింది. రెవెన్యూ పరంగా, పోలీసు శాఖ పరంగా ఇప్పటి వరకున్న అయోమయానికి తెర దింపుతూ ఈ విభజన జరిగిందనే చెప్పవచ్చు. శంషాబాద్ వరకు హైదరాబాద్ సరిహద్దులను నిర్ణయిస్తూ త్వరలోనే సర్కారు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమచారం.
వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి దశలో ఉన్నందున మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీని విభజించినా, ఈ ఆర్థిక సంవత్సరం చవరి వరకు (మార్చి) సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలోని అన్ని క్యాటగిరీల ఉద్యోగుల జీతభత్యాలను జీహెచ్ఎంసీయే చెల్లించనున్నట్లు తెలిసింది. ఇక పౌర, అత్యవసర సేవలకు సంబంధించి కూడా పూర్తి స్తాయిలో విభజనను ఇదివరకే పూర్తి చేశారు. మల్కాజ్ గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో నిన్నటి అడిషనల్ కమిషనర్లుగా వ్యవహారించిన అధికారులు ఇపుడు కమిషనర్లుగా, జాయింట్ కమిషనర్లు అదనపు కమిషనర్లుగా వ్యవహారించేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)గా ప్రజలకు ఆన్ లైన్ సేవలందించే దిశగా ఇప్పటికే జీహెచ్ఎంసీ వెబ్ సైట్ ను కూడా మూడు గా విభిజించారు. మై జీహెచ్ఎంసీ యాప్ ను ఒక్క జీహెచ్ఎంసీకి పరిమితం చేసి, త్వరలో మై ఎంఎంసీ, మై సీఎంసీ వెబ్ వైట్ లుగా రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వెబ్ సైట్ లో పన్ను చెల్లింపులు, బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు ఇతర ఆన్ లైన్ సేవలు ప్రస్తుతం పాక్షింగానే అందుతున్నా, మార్చి నెలాఖరు తర్వాత జీహెచ్ఎంసీ తరహా అన్ని రకాల ఆన్ లైన్ సేవలను ఎంఎంసీ, సీఎంసీలల్లో పునరుద్దరించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
విస్తరించినానంతరం బుధవారం సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 680 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గొల్కొండ, ఖైరతాబాద్, సికిందరాబాద్ జోన్లతో ఏర్పాటైన జీహెచ్ఎంసీ కి ఇకపై నిర్మాణ అనుమతులు పది అంతస్తులకే పరిమితం కానుంది. జీహెచ్ఎంసీతో పాటు ఎంఎంసీ, సీఎంసీల్లో పది అంతస్తులకు మించిన అనుమతులను ఇకపై హెచ్ఎండీఏ జారీ చేయనుంది. తాజాగా ఏర్పడిన మూడు కార్పొరేషన్ల పరిధిలో అది అంతస్తులకు మంచి పద కొండు ఆపై అంతస్తులకు హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులను జారీ చేసి, ఆ నిర్మాణ అనుమతికి స్వీకరించిన ఫీజులో పది శాతాన్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించనున్నట్లు తెలిసింది.
చారిత్రక హైదరాబాద్ నగర వాసులకు పౌర, అత్యవసర సేవలందించే నాటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) 2007లో శివారు పన్నెండు మున్సిపాల్టీల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 170 కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్ల వరకు పరిధి పెరిగింది. గత నవంబర్ 25 వరకు ఇలాగే కొనసాగిన జీహెచ్ఎంసీ పరిధిలోకి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో పరిధి 2 వేల 53 కిలోమీటర్లు పెరిగి రెండో సారి రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీని సర్కారు తాజాగా బుధవారం మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా గడిచిన 19 ఏళ్లలో ఎంసీహెచ్ మూడు సార్లు రూపాంతరం చెంది దేశంలోనే అతి పెద్ద కార్పొరేషన్ గా అవతరించి, అనతి కాలంలోనే మళ్లీ 680 చదరపు కిలోమీటర్లు, 150 మున్సిపల్ వార్డులతో మరోసారి రూపాంతరం చెందింది.
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ 3 14 74
జీహెచ్ఎంసీ (హైదరాబాద్) 6 30 150
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 16 76