HCU Campus Land Issue: హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములపై కీలక పత్రాలు బయటపెట్టింది ప్రభుత్వం. కంచె గచ్చిబౌలి భూములతో HCUకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు విడుదల చేసింది.
చంద్రబాబు హయాంలోనే హెచ్‌సియు(HCU) నుంచి భూములు తీసుకున్న పంచనామా రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఆ భూములకు బదులుగా గోపన్‌పల్లిలో HCUకు భూమిని కేటాయించింది. ఇందుకు సంబంధించిన పంచనామా రిపోర్ట్ కూడా విడుదల చేసింది సర్కార్. ఆ రెండు డాక్యుమెంట్లపైనా అప్పటి HCU రిజిస్ట్రార్ నర్సింహులు సంతకం కూడా చేశారు. ఇన్ని ఆధారాలున్నా కూడా, ఇప్పటికీ ఆ భూములు తమవే అని HCU చెప్పడం సరికాదని సూచించింది సర్కార్.
అంతకు ముందు T.G.I.C.C కూడా వివరణ ఇచ్చింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది. ఈ భూమికి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని వివరించింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు చెప్పింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని, సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది.
ఆ 400 ఎకరాల భూముల వేలం, అభివృద్ధి పనులు… అక్కడి రాళ్లను దెబ్బతీయవని స్పష్టం చేసింది. అలాగే.. అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువులు లేవని కూడా ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే కొందరు రాజకీయ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చింది T.G.I.C.C
ఐతే దీన్ని (HCU)రిజిస్ట్రార్ తప్పుబట్టారు. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే చేయలేదని, పరిశీలన మాత్రమే చేశారన్నారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్‌సియు(HCU)కి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. భూమి కేటాయించడంతోపాటు పర్యావరణం, జీవ వైవిద్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామన్నారు హెచ్‌సియు(HCU) రిజిస్ట్రార్.
సోమవారం సాయంత్రం హెచ్‌సియు రిజిస్ట్రార్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని తెలిపారు. పర్యావరణం, జీవవైవిద్యం కాపాడటానికి సదరు భూములను హెచ్‌సియుకే ఇవ్వాలని కోరతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌సియు(HCU )విద్యార్థుల వరుస ఆందోళనలతో పాటు.. ప్రతిపక్ష పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Also Read: టికెట్ల కోసం టార్చరా? సీఎం రేవంత్ సీరియస్.. సీన్‌లోకి సూపర్ పోలీస్
కాగా.. HCUకు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. కంచ గచ్చిబౌలి భూములు వేలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థి సంఘాలకు మద్దతుగా ఆపార్టీ ఎమ్మెల్యేలు భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. హైదర్‌గూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. HCU విజిటింగ్‌కి బీజేపీ ఎమ్మెల్యేల బృందం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ MLAలు HCUకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే MLA క్వార్టర్స్ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. ఎట్టి పరిస్థితిలో సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తామంటున్న బీజేపీ నేతలు చెబుతున్నారు.