Hyderabad: హైదరాబాద్ సిటీలో పలుచోట్ల భూముల వేలానికి సిద్ధమైంది రాష్ట్రప్రభుత్వం. 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్-TGIIC ద్వారా విక్రయించనుంది. అందులో రాయదుర్గం, ఉస్మాన్ సాగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
పెద్ద పెద్ద నగరాల్లో భూముల వేలం అనే సరికి చాలామంది ఆసక్తి చూపుతారు. ముంబై, బెంగుళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ధర పెట్టి ఆయా భూములను కొనుగోలు చేశారు.. చేస్తున్నారు కూడా. మెట్రో విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోకాపేట్‌ని తలదన్నే విధంగా ఎకరా ధర గరిష్టంగా 104 కోట్లకు వెళ్లే అవకాశముంది.
హైదరాబాద్ సిటీ పరిధిలో భూముల వేలానికి సిద్ధమైంది ప్రభుత్వం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 66 ఎకరాల భూమిని విక్రయించేందుకు రెడీ అవుతోంది. 17 ప్లాట్లను వేలం వేయాలని భావిస్తోంది. అందులో రాయదుర్గం-4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్- 13 ప్లాట్లు ఉన్నాయి.
కొన్ని రోజుల కిందట టీజీఐఐసీ 66 ఎకరాల భూమి అమ్మకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచింది. ఈ భూముల విక్రయానికి సంబంధించి టెండర్ దాఖలుకు ఆగస్టు 8 వరకు సమయం ఇచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆగష్టు 12న టెండర్ అవార్డు ఇవ్వనున్నారు.
ALSO READ: ఆగష్టు 6న ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నాం.. అన్ని పార్టీలకు మంత్రి పొన్నం పిలుపు
రాయదుర్గంలో ప్లాట్‌కు అత్యధికంగా మార్కెట్ ధర రూ. 71.60 కోట్లుగా TGIIC పేర్కొంది. కనీస ధర రూ. 50.10 కోట్లుగా ప్రస్తావించింది. ఆ ప్రాంతంలోని 7.67 ఎకరాలను వేలం వేయనుంది. అదే ప్రాంతంలో ప్లాట్ 19 ధర రూ. 66.30 కోట్లు పెట్టింది. అప్‌సెట్ ప్రైస్ ను 44.30 కోట్లుగా ప్రస్తావించింది. ఈ పార్సిల్లో 11 ఎకరాలను వేలంలో విక్రయించాలని నిర్ణయించింది.
రాయదుర్గంలో మార్కెట్ ధర చదరపు గజానికి రూ.2,16,405గా వెల్లడించింది. ఈ లెక్కన ఎకరం భూమి ధర రూ.104.74 కోట్లు అన్నమాట. ఈ రెండు ప్లాట్ల అప్ సెట్ ప్రైస్ ప్రకారం ఎకరానికి రూ.73.32 కోట్లు. రాయదుర్గంలో 19.67 ఎకరాలను వేలంలో విక్రయించనుంది ప్రభుత్వం. ఉస్మాన్ సాగర్ సమీపంలో 1 నుంచి 15 వరకు ప్లాట్ల వేలం వేయాలని (8, 10 మినహాయింపు) నిర్ణయించారు. మార్కెట్ ధర ప్లాట్ ను బట్టి రూ.18.70 నుంచి రూ.25 కోట్లుగా పేర్కొన్నారు.
గతంలో కోకాపేట్ ప్రాంతంలో భూముల వేలం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ ఎకరం 100 కోట్ల రూపాయలకు పైనే పలికింది. ఇప్పుడు రాయదుర్గంలో ప్లాట్ల ధరలు ఎకరాకు రూ.104 కోట్లు పలికే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వేలం భాగ్యనగరంలో భూముల ధరలకు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.