Telangana Govt: మున్సిపోల్స్ లో అధికార పార్టీ అఖండ విజయం సాధించటంతో అదే జోష్ తో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. గత నవంబర్ 25వ తేదీన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత పెరిగిన పరిధి పునర్విభజన, అభ్యంతరాల స్వీకరణ, చివరిగా పెరిగిన విస్తీర్ణాన్ని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ఎంతో స్పీడ్ గా కసరత్తు చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మూడు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలైనట్లు తెలిసింది.
మూడు కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహించేందుకు తొలుత సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 150 వార్డులను పునర్విభజించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కార్పొరేషన్లలోని వార్డుల సంఖ్యను 200కు పరిమితం చేసేలా ఈ వార్డుల పునర్విభజన చేపట్టాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత వార్డులు, మేయర్, డిప్యూటీ మేయర్ల సీట్లకు రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
శంషాబాద్ వరకు 150 వార్డులతో విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీ మేయర్ సీటును ఇటీవలే మహిళా జనరల్ గా రిజర్వు చేసినప్పటికీ, ఇపుడు మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటం, జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తగా పట్టణ స్దానిక సంస్థలు విలీనమైన విషయాన్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే దిశగా కసరత్తు మొదలైనట్లు తెలిసింది. మే మాసం చివరి కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, పాలక మండలిలను కొలువుదీరేలా ఎన్నికల కసరత్తును వేగవంతం చేయాలని సర్కారు ఆదేశించినట్లు సమాచారం.
ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన జీహెచ్ఎంసీ మినహా మిగిలిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 150 మున్సిపల్ వార్డులను 45 వేల జనాభా కటాఫ్ గా పది శాతం మైనస్ గా గానీ, పది శాతం ప్లస్ గా గానీ పునర్విభజన చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్న మున్సిపల్ వార్డులను కూడా ఇటీవలే 45 వేల జనాభా కటాఫ్ గా పునర్విభజించినా, కొన్ని వార్డుల్లో కనిష్టంగా 30 వేల జనాభా, గరిష్టంగా 70 వేల నుంచి 80 వేల జనాభాతో కూడా వార్డులను ఏర్పాటు చేసినట్లు అప్పట్లో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇపుడు కూడా 76 మున్సిపల్ వార్డులతో సైబరాబాద్, మరో 74 వార్డులతో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటైన సంగతి తెల్సిందే.
మరోసారి పునర్విభజన చేపట్టి, సరిగ్గా 45 వేల జనాభాకు నాలుగున్నర వేల జనాభా ఎక్కువ గానీ, నాలుగున్నర వేల జనాభా తక్కువతో గానీ పునర్విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఒక్కో వార్డు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా, ఒక్కో వార్డు రెండు మున్సిపల్ సర్కిల్స్, జోన్ల పరిధిలోకి రాకుండా జాగ్రత్తలు వహిస్తూ పునర్విభజ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు సిద్దం చేయాలని సర్కారు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అనుకూలమైన ఆదరణ ఉందన్న విషయం మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోవటంతో సర్కారు ఇపుడు తదుపరిగా జీహెచ్ఎంసీలోని మూడు మేయర్ల సీట్లను కైవసం చేసుకునే టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
Also Read: CPI: కొత్తగూడెంపై ఎర్రజెండా ఎగురవేసింది.. పట్టు నిలుపుకున్న సీపీఐ