Telangana : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పినట్టే ధరణిని బంగాళాఖాతంలో కలిపేసింది. మరింత మెరుగైన భూభారతిని తీసుకొచ్చింది. తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలు లేకుండా చేయాలనే సంకల్పంతో ఉంది. అందుకు తగ్గట్టే రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. గ్రామ స్థాయిలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. గ్రామ పరిపాలన అధికారి ( జీపీవో ) పోస్టులు క్రియేట్ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే పరీక్ష నిర్వహించగా.. తాజాగా ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ సర్కారు.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతం
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతోనే రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి అన్నారు. భూ సమస్యలు తొలగించేందుకు గ్రామానికో అధికారిని నియమించబోతున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. జీపీఓల నియామకంతో రెవెన్యూ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి కృషి ఫలితంగానే ఇదంతా సాధ్యమైందని లచ్చిరెడ్డి తెలిపారు. జీపీవో పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి పొంగులేటిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
భూ భారతిపై భూ యజమానులకు, రైతులకు, ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు లచ్చిరెడ్డి. ఇప్పటికే రెండు విడతల సదస్సులు విజయవంతం అయ్యాయని చెప్పారు. జూన్ 3 నుంచి జరిగే మూడో విడత సదస్సుల నాటికి జీపీఓలు విధుల్లో చేరే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సర్కారుకు థ్యాంక్స్..
మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, కార్యదర్శి కె.రామకృష్ణన్.. తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాములు, కార్యదర్శి రమేష్ పాక.. తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి భిక్షం.. జీపీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షడు ఉపేందర్ రావు, కార్యదర్శి లక్ష్మీ నరసింహా తదితరులు ఉన్నారు.